ఎన్నికలకు ఇంకా యాభై రోజులకు పైగా వ్యవధి ఉంది. కానీ ఏపీలో మాత్రం ఓట్ల యుధ్ధం పెద్ద ఎత్తున సాగుతోంది. అధికారం కోసం ఢీ అంటే ఢీ అంటున్న టీడీపీ, వైసీపీ రెండూ కూడా ఎక్కడా తగ్గడం లేదు. అన్ని రకాల ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ సమరమే అంటున్నాయి.  


దారుణమే :


ఏపీలో ఓట్ల తొలగింపు పై ఇపుడు పెద్ద యుధ్ధమే జరుగుతోంది. ఏపీలో ఏకంగా  ఏడున్నర లక్షమ ఓట్లను తొలగించమంటూ ఎన్నికల సంఘానికి దరఖాస్తులు వచ్చాయట. ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఎక్కడైనా ఓటు హక్కు కావాలంటూ దరఖాస్తులు వస్తాయి. దాని కోసం పోటీ ఉంటుంది. ఉత్సాహం ఉంటుంది. కానీ మా ఓట్లు తొలగించమంటూ ఏడున్నర లక్షలకు పైగా దరఖాస్తులు  రావడం ఏంటి. దీనిపై ఇపుదు ఎన్నికల సంఘం తలలు పట్టుకుంటోంది. నిజంగా ఇలా జరుగుతుందా. దీని వెనక ఎవరు ఉన్నారు. ఎవరి ఓట్లు ఇంత పెద్ద ఎత్తున పోబోతున్నాయి. ఎవరికి గురి ఏంటి అన్నది ఇపుడు సమగ్రమైన దర్యాప్తు ఎన్నికల సంఘం చేపడుతోంది.
ఓటర్ల తొలగింపునకు వినియోగించే ఫారం -7కు సంబంధించిన విన్నపాలు 7.50 లక్షలు ఎన్నికల అధికారులకు అందడం విస్మయం కలిగిస్తోంది.  తమ ఓటు తొలగించమని ఎక్కడో ఒక్కరిద్దరు మినహా ఎవరూ దరఖాస్తు చేయరు. అలాంటిది ఏకంగా 7.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు తొలగించమని దరఖాస్తులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపితే ఈ దరఖాస్తులు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారన్నది వెలుగులోకి వస్తుంది


ఆ ఓట్లపై విచారణ :


ఇక ఎన్నడూ లేని విధంగా ఈసారి పదిన్నర లక్షల ఓట్లపై ఎన్నికల సంఘం విచారణ జరపబోతోంది. ఈ ఓట్లలో నకిలీలు, డబులు ఓట్లు, చచ్చిన వారి ఓట్లు ఇలా ఎన్నో ఉన్నాయని తేలుతోంది. స్వయంగా ఎన్నికల సంఘం ఈ ఓట్లపై  విచారణ జరుపుతోంది. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వివాదాస్పదం కావడం ఇంతకు ముందెప్పుడూ లేదు. ఈ విషయమో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేది  వివరణ ఇస్తూ 10.5 లక్షల ఓటర్లకు సంబంధించి విచారణ జరుగుతోందని ఆ తరువాతే ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల గురించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.


పాతిక లక్షల ఓట్లా :


అసలు ఇంతకూ ఏపీలో ఎన్ని ఓట్లు గల్లంతు అయ్యాయి. అవి ఏ పార్టీ ఓట్లు, ఎవరు ఈ పని చేస్తున్నారు అన్న ప్రశ్నలు ఇపుడు అందరినీ వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో 25 లక్షల ఓట్లను తొలగించారని మొదట వైసీపీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది.  తాజాగా అధికార తెలుగుదేశం పార్టీ ఎదురుదాడికి దిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో కొందరు సైబర్ నేరగాళ్లు తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగించేందుకు సిద్దమయ్యారని, జాగ్రత్తగా ఉండాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొనడం గమనార్హం.


తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఓటరు జాబితాలో వారి పేరు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ప్రయత్నాలు బహిరంగం కాకూడదని వైసీపీ నేత లు ముందే జాగ్రత్తపడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఓట్లను తొలగిస్తోందని ఆరోపణలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు మొత్తం మీద చూసుకుంటే రెండు పార్టీల ఆరోపణలు సీరియస్ గానే ఉన్నాయి. దీని మీద ఎన్నికల సంఘం పూర్తి దర్యాప్తు జరపాల్సి ఉంది. లేకపోతే అసలైన ఓటర్లకు అన్యాయం జరిగే అవాకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: