ఖ‌మ్మం జిల్లా నుంచి సైకిల్ గుర్తుపై విజ‌యం సాధించిన స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ‌ర‌రావు టీఆర్ ఎస్‌లో చేర‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌చారం జోరుగా సాగుతుండ‌గానే శ‌నివారం రాత్రి సండ్ర వెంక‌ట‌వీర‌య్య ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సాగ‌ర్ జ‌లాల కోస‌మేనంటూ వెంక‌ట వీర‌య్య వివ‌ర‌ణ ఇస్తున్నా అస‌లు విష‌యం మాత్రం పార్టీ మార్పు గురించేన‌ని తెలుస్తోంది. పార్టీలోకి వ‌చ్చాకా ఎలాంటి ప్రాధాన్యం క‌ల్పిస్తారనే దానిపై కేసీఆర్ నుంచి హామీ తీసుకునేందుకే ఆయ‌న భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇక మెచ్చా నాగేశ్వ‌ర్‌రావు ప‌రిస్థితి మాత్రం కొంత అర్థం కావ‌డం లేదు. ఆయ‌న కొంత ఊగిస‌లాట ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


పైకి మాత్రం తాను పార్టీ మారేది లేద‌ని విలేక‌రుల‌కు ప‌దేప‌దే చెబుతూ వ‌స్తున్నారు.  వాస్త‌వానికి వీరిద్ద‌రు  గెలిచిన నాటి నుంచే గులాబీ పార్టీలో చేరిపోతార‌నే చ‌ర్చ మొద‌లైంది. అందుకు బ‌లం చేకూర్చేవిధంగా గ‌తంలో ఇద్ద‌రు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావుతో భేటీ అయి పార్టీ మార్పుపై చ‌ర్చించిన‌ట్లు వార్త‌లు గుప్పుమ‌న్నాయి. మీడియా కంట‌ప‌డిన సంఘ‌ట‌న‌లున్నాయి. అదేమంటే రాజ‌కీయ గురువుతో సాధార‌ణ భేటీ అంటూ అస‌లు విష‌యాన్ని మాత్రం చెప్ప‌కుండానే దాటవేశారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వీరిద్దరి పార్టీ మార్పుపై  స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థి విజ‌యం సాధించాలంటే కాంగ్రెస్‌కు వీరిద్ద‌రి మ‌ద్ద‌తు త‌ప్ప‌నిస‌రి. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ కీలకం కాబోతోంది.


కాంగ్రెస్‌ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి గెలుపొందాలంటే  కాంగ్రెస్‌కు ఉన్న‌ 19 మంది ఎమ్మెల్యేల‌తో పాటు టీడీపీ నుంచి ఇద్దరు సహకరిస్తే కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందే అవకాశాలున్నాయి.  ఇందుకోస‌మే  టీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ద్వారా టీడీపీ మద్దతు అడిగారు. అయితే టీడీపీ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న సండ్ర టీఆర్ ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయ‌న ఓటు టీఆర్ ఎస్‌కు ప‌డే అవ‌కాశం మెండుగా ఉంది. ఇక  మెచ్చా నాగేశ్వరరావు ఓటు కాంగ్రెస్‌కు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే స‌మ‌యం ఉండ‌టంతో మెచ్చాను కూడా త‌మ‌వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: