ఏపీ రాజ‌కీయాల్లో జంపింగ్ జంపాగ్‌లు కొన‌సాగుతున్నాయి.. అధికారం కోసం కొంద‌రు....హామీల‌తో కొంద‌రు పార్టీలు మారుతూ వ‌స్తున్నారు. ఇప్పుడు ఇదే కోవ‌లో క‌ర్నూలు జిల్లాకు చెందిన  మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా రాజగోపాల్ రెడ్డి ఆదివారం టీడీపీలో చేరారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమక్షంలో రాజగోపాల్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు టీడీపీలో చేరారు. కొంత‌కాలంగా  అక్క‌డి వైసీపీ నేత‌లు కొంద‌రు టీడీపీలో చేరుతూ వ‌స్తున్నారు. కాంగ్రెస్‌లోని పాత‌త‌రం నేత‌లు కూడా టీడీపీ పంచ‌న చేరారు.  దీంతో అక్క‌డ టీడీపీ  బ‌లోపేతం అవుతూ వ‌స్తోంది. ఇక ఇప్పుడు రాజ‌గోపాల్‌రెడ్డి చేరిక‌తో టీడీపీకి మ‌రింత బ‌లం చేకూరింద‌నే చెప్పాలి.


నంద్యాల పార్ల‌మెంటు సెగ్మెంట్‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీమంత్రి   శిల్పామోహ‌న్‌రెడ్డి ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. అంత‌కు ముందు ఆయ‌న టీడీపీలోనే ప‌నిచేశారు. అయితే టీడీపీ నుంచి నంద్యాల ఎంపీ టికెట్ ఆశించి భంగ‌ప‌డిన ఆయ‌న  ఆ ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందు వైసీపీలోకి జంప్ అయ్యారు. చంద్ర‌బాబుపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు సైతం దిగిన ఆయ‌న ఓట‌మి అనంత‌రం వైసీపీలో కూడా ఆక్టివ్‌గా ఉండ‌టం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే ఆయ‌న సోద‌రుడు టీడీపీలో చేర‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిగోల్పుతోంది. శిల్పా రాజ‌గోపాల్‌రెడ్డి చేరిక‌తో సొంత ఇంటిలోనే చీలిక వ‌చ్చింద‌ని, కుటుంబ నేప‌థ్యంగా ఉన్న ఓటు బ్యాంకులోనూ  టీడీపీకి వాటా ద‌క్క‌నుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు సంతోషంతో ఉన్నాయి.


క‌ర్నూలు జిల్లా ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో  టీడీపీకి ధీటుగా  అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌డంలో నిమ‌గ్న‌మైన వైసీపీకి రాజ‌గోపాల్‌రెడ్డి చేరిక గ‌ట్టి ఎదురుదెబ్బ‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇది జిల్లా రాజ‌కీయాల‌పై ఎంతో కొంత ప్ర‌భావం చూపుతుంద‌ని పేర్కొంటున్నారు. మ‌రికొంత‌మంది  రెడ్డి సామాజిక వ‌ర్గం  నేత‌లు  టీడీపీలోకి వ‌చ్చే అంశం లేక‌పోలేద‌ని, ఇది ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏ స్థాయికి చేరుతుందోనన్న ఆందోళ‌న వైసీపీలో ఉంద‌ని తెలుస్తోంది. శిల్పా మోహ‌న్‌రెడ్డియే త‌మ్ముడిని టీడీపీలోకి సాగ‌నంపారా..? అన్న అనుమానాల‌ను కూడా కొంత‌మంది వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: