నెల్లూరు జిల్లా సమర శంఖారావం సభలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో దొంగల పాలన జరుగుతోందని  మండిపడ్డారు. రాక్షసుడిని ముఖ్యమంత్రి అనాల్సి రావడం బాధగా ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ఉండేందుకు ఆయన అనర్హుడని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


మండుటెండలో సైతం నెల్లూరు సమర శంఖారావం సూపర్ సక్సెస్ అయింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా సభకు వచ్చిన వారందరికీ జగన్ ధన్యవాదాలు తెలిపారు. 9 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నామని, అధికారంలోకి రాగానే కష్టాలన్నీ తొలగిపోతాయని జగన్ భరోసా ఇచ్చారు. కార్యకర్తలపై పెట్టిన కేసులన్నీ తొలగిస్తామని హామీ ఇచ్చారు. పోలీసులను చంద్రబాబు తన వ్యక్తిగత అవసరాలకోసం రౌడీమూకల్లా వాడుకుంటున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ మండిపడ్డారు. నాలుగేళ్ళ పాటు బీజేపీ, పవన్ తో కలిసి దోచుకున్నారన్న జగన్.. ఇప్పుడు వారితోనే పోరాటం చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాను నాలుగున్నరేళ్లు తాకట్టు పెట్టి ఎన్నికల ముందు నల్ల చొక్కాలేసుకుని దీక్షలు అంటూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మన హామీలను కాపీకొట్టి రెండు నెలల ముందు పెన్షన్ పెంచారని,, అలాంటివి నమ్మొద్దని హెచ్చరించారు.


ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన పౌరుల సమాచారం ప్రైవేటు సంస్థల దగ్గర ఎందుకుందో ప్రజలు గ్రహించాలని సూచించారు. ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలకు ఆ డేటా ఎందుకెళ్లిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ కంపెనీలు చంద్రబాబువేనన్నారు. మీకు సంబంధించిన సమస్త సమాచారం వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ బ్యాంక్ ఖాతా సైతం వాళ్ల దగ్గర ఉందన్నారు. మీ సంతకాలు కూడా ఫోర్జరీ చేసే రోజులొచ్చాయని హెచ్చరించారు.


సంక్షేమ పథకాలకు కులాలు అడ్డు రాకూడదని జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు హయాంలో తన కులపు వాళ్లకు, తన పార్టీ వాళ్లకే లబ్ది చేకూరుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే పార్టీ వాళ్లని తెలియగానే వారికి ప్రభుత్వ లబ్ది జరగకుండా ఆపేస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఓటు హక్కు అడిగే అర్హత లేదని చెప్పారు.


రాష్ట్రంలో 39 లక్షల ఓట్లు తొలగించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చివరకు తన చిన్నాన్న ఓటు కూడా తొలగించారని చెప్పారు. వైసీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు కుట్ర చేశారన్నారు. ఇంకా 59 లక్షలకు పైగా ఓట్లు నకిలీవి ఉన్నట్టు చెప్పారు. మీ ఓట్లు జాబితాలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని కార్యకర్తలను కోరారు. మీ ఓటు హక్కు ఉందోలేదో చెక్ చేసుకోవడంతో పాటు నకిలీ ఓట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదేనన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మోసాలను గ్రామగ్రామాలలో బూత్ కమిటీ సభ్యులు వివరించాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: