ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ రాజ‌కీయనాయ‌కుల  క‌ప్ప‌దాట్లు..గోడ‌దూకుడులు ఎక్కువ‌వుతున్నాయి. డిమాండ్లు నెర‌వేర్చితే ఉండ‌టం లేదంటే..ప‌క్క‌చూపులు చూడ‌టం ప‌రిపాటిగా మారింది. అవ‌కాశాలు..అవ‌స‌రాలు వారిని పార్టీలు మార‌డానికి ఉసిగొల్పుతున్నాయి. ఇప్పుడు ఇదే కోవ‌లో నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డితో పాటు ఆయ‌న అల్లుడు, నంది గ్రూపు సంస్థల ఎండీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ శ్రీధర్‌రెడ్డి త్వ‌ర‌లో టీడీపీ వీడ‌నున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. నంద్యాల ఎంపీ, అసెంబ్లీ టికెట్ల‌ను అడిగిన వీరికి చంద్ర‌బాబు వ‌ద్ద చుక్కెదురైన‌ట్లు స‌మాచారం. దీంతో వారు పార్టీ వీడేందుకు సిద్ధ‌మైనట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వీరు నంద్యాల ఎంపీ లేదా అసెంబ్లీ సీట్లలో ఏదో ఒక‌టి ద‌క్కుతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు.


అటు ఎంపీగానీ..ఇటు అసెంబ్లీ టికెట్ గానీ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని భావించిన వారు వైసీపీలో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  అందుకోసం ఈనెల 10న త‌మ అనుచ‌రులు, పార్టీలోని మ‌ద్ద‌తుదారుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే టీడీపీ ఎంపీలు  పండుల ర‌వీంద్ర‌బాబు, అవంతి శ్రీనివాస్ వైసీపీ తీర్థం పుచ్చుకోగా ఇప్పుడు ఎస్పీవైరెడ్డి కూడా పార్టీ మారితే ముచ్చ‌ట‌గా ఆయ‌న‌ది మూడో నెంబ‌ర్ అవుతుంది. ఇక తోట న‌ర్సింహులు పార్టీ మారుతాడ‌ని ఎప్ప‌టి నుంచో టాక్ ఉంది. అయితే ఆయ‌న ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.


2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఎస్పీవైరెడ్డి కొద్దిరోజుల‌కే టీడీపీలోకి జంప్ అయ్యారు. ఈ సారి ఆయ‌న‌కు నంద్యాల ఎంపీ టికెట్‌తో పాటు అల్లుడికి అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తూ వ‌స్తున్నారు. గ‌త కొద్దిరోజులుగా ఆయ‌న తీవ్ర ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. ఇందుకోసం ఆయ‌న పార్టీలో అన్నీతానై వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లుపెట్టారు. అయితే అసమ్మ‌తి కూడా ఇక్క‌డ బ‌లంగా ఉండ‌టంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు వీరికి టికెట్లు ఇవ్వ‌డంపై ఆస‌క్తిలేన‌ట్లు ఆయ‌న చ‌ర్య‌ల ద్వారా స్ప‌ష్ట‌మైంది.

ఈ విష‌యంపై స్వ‌యంగా వారు చంద్ర‌బాబుతో కూడా మాట్లాడాక ఆయ‌న వైఖ‌రితో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీనికితోడు వైసీపీ నుంచి కూడా ఆయ‌న‌కు పిలుపు ఉండ‌టంతో ఆయ‌న చివ‌రి ప్ర‌య‌త్నంగా రాయ‌బారాలు సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 10వ తేదీలోపు అధిష్ఠానం దిగివ‌స్తే పార్టీలో కొన‌సాగ‌డం..లేదంటే వీడ‌డం అనే ధోర‌ణితో ఉన్న‌ట్లు స‌మాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: