తెలుగుదేశంపార్టీ  సీనియర్ నేత దాసరి బాలవర్ధనరావు పార్టీకి రాజీనామా చేశారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గానికి బాలవర్ధనరావు నాలుగుసార్లు పోటీ చేశారు. అయితే 1999, 2009 ఎన్నికల్లో గెలిచిన బాలవర్ధనరావు 2004, 1994 ఎన్నికల్లో ఓడిపోయారు. మొత్తానికి ఓడిపోయినా, గెలిచినా బాలవర్ధనరావుకు నియోజకవర్గంలో అయితే మంచి పట్టే ఉంది. అదే సమయంలో దాసరి ట్రాక్ రికార్డు కూడా క్లీన్ గానే ఉంది.

 

రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బాలవర్ధనరావు ప్రయత్నం చేసినా టికెట్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే, సిట్టింగ్ ఎంఎల్ఏగా వల్లభనేని వంశీ ఉన్నారు. దాంతో దాసరి రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లే. అదే సమయంలో సోదరుడు దాసరి జై రమేష్ ఈమధ్యనే వైసిపిలో చేరారు. ఆయన కూడా దాదాపు మూడు దశాబ్దాల పాటు టిడిపిలో కీలకంగానే ఉన్నారు. అలాంటిది చంద్రబాబుతో కుదరకే టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు.

 

రాబోయే ఎన్నికల్లో జై రమేష్ విజయవాడ లోక్ సభ నుండి దాదాపు టికెట్ ఖాయమైనట్లుగా పార్టీ వర్గాలు చెప్పాయి. సోదరుడు వైసిపిలో చేరగానే బాలవర్ధనరావు కూడా తొందరలోనే వైసిపిలో చేరటం ఖాయమని ప్రచారం మొదలైంది. దాన్ని నిజం చేస్తున్నట్లుగా బాలవర్ధనరావు కూడా టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. గన్నవరం నియోజకవర్గంలో దాసరి సోదరులకు మంచి పట్టుంది. ప్రచారం నిజమై జై రమేష్ గనుక విజయవాడ ఎంపిగా పోటీ చేస్తే వైసిపికి గట్టి నేతను పోటీకి దింపినట్లే లెక్క.

 


మరింత సమాచారం తెలుసుకోండి: