దశాబ్దాల నుంచి కొనసాగుతోన్న అయోధ్య వివాదం కేసులో మధ్యవర్తిత్వంపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. శ్రీశ్రీ రవిశంకర్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కల్లీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచులతో కూడిన ముగ్గురు మధ్యవర్తుల ప్యానెల్‌ను ప్రకటించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్‌లో కొనసాగాలనీ... చర్చలన్నీ సీసీ కెమేరా పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా కొనసాగాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన సమాచారం మీడియా సహా మరెవ్వరికీ తెలుపరాదని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా మధ్యవర్తిత్వ ప్రక్రియపై త్రిసభ్య ప్యానెల్ తొలి నివేదిక సమర్పించనుంది.
 
జస్టిస్ కల్లీఫుల్లా నేతృత్వం వహించనున్న మధ్యవర్తుల బృందం వచ్చే వారంలోనే పని ప్రారంభించనుందనీ.. 8 వారాల్లోగా మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. 

 వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడా, రాంలల్లా సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా నిర్మోహీ అఖాడా మినహా హిందూత్వ సంస్థలన్నీ మధ్యవర్తిత్వానికి ససేమిరా అంటుండగా... ముస్లిం సంస్థలు మధ్యవర్తిత్వానికి ఇప్పటికే మద్దతు తెలిపాయి. ఈ నేప‌థ్యంలో అందరి మనోభావాలను గౌరవిస్తూ, సామరాస్యాన్ని కాపాడుతూ, వివాదాలకు ముగింపు పలికి అంతా సంతోషంగా ఉండాలని రవిశంకర్ ట్విట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: