మొత్తానికి ప్రముఖ హాస్యనటుడు ఆలీ వైసిపిలో చేరారు. వైసిపి, జనసేన, టిడిపిల మధ్య దోబూచులాడిన ఆలీ చివరకు వైసిపి గూటికే చేరారు. లోటస్ పాండ్  నివాసంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీ కండువాను కప్పుకున్నారు. తర్వాత  మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావటం తథ్యమన్నారు. గతంలో వైఎస్ కూడా పాదయాత్ర తర్వాతే సిఎం అయిన విషయాన్ని గుర్తుచేశారు.

 

అప్పట్లో వైఎస్ సిఎం అయినట్లే తాజాగా పాదయాత్ర చేసిన జగన్ కూడా సిఎం అవటం ఖాయమంటూ జోస్యం చెప్పారు. వైసిపి తరపున తాను కేవలం ప్రచారం మాత్రమే చేస్తానన్నారు.  ఎప్పటికప్పుడు పార్టీలో చేరి పోటీ చేయటం భావ్యం కాదని తాను అనుకున్నట్లు కూడా ఓ మాట చెప్పారు. అంటే పోటీ విషయంలో ఆలీ ఆసక్తి చూపినా జగన్ టికెట్ సాధ్యం కాదని చెప్పినట్లున్నారు. దాన్నే ఆలీ తెలివిగా రివర్సులో చెప్పుకున్నారు.

 

వైసిపిలో చేరిన ఆలీ ఇన్ని రోజులు ఎందుకు వివిధ పార్టీల మధ్య దోబూచులాడారో అర్ధం కావటం లేదు. ఆలీ వైసిపిలో చేరుతున్నట్లు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రచారాన్ని ఆలీ ఖండించారు. తర్వాత చంద్రబాబునాయుడును కలిశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. తన ఓటును పశ్చిమ నియోజకవర్గంలోకి మార్చుకున్నట్లు టిడిపి వర్గాలు కూడా చెప్పాయి. దాంతో టిడిపి తరపున ఆలీ పోటీ ఖాయమనుకున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ తో కూడా ఆలీ భేటీ అయ్యారు. దాంతో ఆలీ ఆలోచనలేంటో అర్ధంకాక చాలామంది జుట్టు పీక్కున్నారు. పార్టీల్లో కూడా గందరగోళం రేగింది. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆలీ హఠాత్తుగా వైసిపిలో చేరటం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: