ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ పార్టీల వ్యూహ ప్ర‌తివ్యూహాలు కూడా అదే రేంజ్‌లో ఉంటున్నాయి. ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాల‌ని భావిస్తున్న వైసీపీ, ఎలాగైనా తిరిగి అధికారం నిల‌బెట్టుకుని తీరాల‌ని చంద్ర‌బాబు ప‌క్కా వ్యూహా లతో ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఒక పార్టీ అభ్య‌ర్థిపై మ‌రొక‌పార్టీ నుంచి ప‌క్కా గెలుస్తార‌నే వారినే అభ్య‌ర్థు లుగా నిల‌బెడుతున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ కొంచెం దూకుడు ఎక్కువ‌గానే చూపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్న చంద్ర‌బాబు తాజాగా కృష్నాజిల్లాలోని అత్యంత కీల‌క‌మైన గుడివాడ‌కు  దేవినేని అవినాష్ పేరును ఖ‌రారు చేశారు.

 
నిజానికి గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో అత్యంత కీల‌క‌మైన, బ‌ల‌మైన వ్య‌క్తి కొడాలి శ్రీవెంక‌టేశ్వ‌ర‌రావు ఉర‌ఫ్ నాని చ‌క్రం తిప్పుతున్నారు. రాజ‌కీయాల్లో ఎంతగా త‌ల‌పండిన నాయ‌కుల‌కు కూడా ఆయ‌న చుక్క‌లు చూపిస్తున్నారు. ఇక్క‌డ ప్ర‌జ‌లు కూడా వ‌రుసగా కొడాలికే మొగ్గు చూపుతున్నారు. వాస్తవారికి ఇక్క‌డ టీడీపీకి రావి వెంక‌టేశ్వ‌రావు, య‌ల‌వ‌ర్తి శ్రీనివాస‌రావు, పిన్న‌మ‌నేని వెంక‌టేశ్వ‌ర‌రావు వంటి ఉద్ధండులు ఉన్నారు. కానీ, గ‌డిచిన మూడు ఎన్నిక‌ల్లోనూ వీరిలో ఏ ఒక్క‌రూ కూడా కొడాలికి చెక్ పెట్టింది లేదు. పైగా మెజారిటీని త‌గ్గించ గ‌లిగింది కూడా లేదు. ఇక‌, ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా టికెట్ వేట‌లోముగ్గురూ కొట్టుకునే ప‌రిస్థితి కూడా ఇక్కడ ఉండ‌డంగ‌మ‌నార్హం. 


ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ కొడాలి విజ‌యం న‌ల్లేరుపైన‌డ‌క‌గా మారుతోంద‌నే ప్ర‌చారం ఉంది. దీనిని దృస్టిలో పెట్టుకున్న చంద్ర‌బాబు.. తాజాగా ఇక్క‌డ వారిని ప‌క్క‌న పెట్టి దేవినేని నెహ్రూ వార‌సుడు అవినాష్‌ను రంగంలోకి దింపారు. ఏపీ తెలుగు యువ‌త అధ్య‌క్షుడుగా ఉన్న అవినాష్‌.. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేశారు. ఆ త‌ర్వాత టీడీపీలో చేర‌డం తెలిసిందే. అయితే, ఇక్క‌డ బ‌లంగా ఉన్న నానిని ఎదిరించ‌డంలో అవినాష్ ఏ మేర‌కు స‌క్సెస్ అవుతార‌నేది వేచి చూడాలి.

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోవ‌డమే కాకుండా ఎక్క‌డా త‌న‌కు వ్య‌తిరేక‌త కూడా లేకుండా చేసుకుంటున్న నానికి త‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన యువ నాయ‌కుడు అవినాష్ ఏమేర‌కు పోటీ ఇస్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఇక్క‌డ అవినాష్‌కు స్థానిక‌త లేక‌పోవ‌డం మైన‌స్‌గా ఉంది. అయితే, దేవినేని నెహ్రూ వార‌సుడిగా మాత్రం ఆయ‌న ఇక్క‌డ నెట్టుకొచ్చేందుకు చాన్స్ ఉంద‌ని అంటున్నారు. మ‌రి బాబు మంత్రం, అవినాష్ తంత్రం ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: