దేవినేని మ‌ల్లికార్జున‌రావు గుంటూరు జిల్లాలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుల్లో ఒక‌రు. మ‌ల్లికార్జున‌రావు 2004లో  రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో విబేధాలు త‌లెత్త‌డంతో 2009లో ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. అయినా ఆయ‌న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న అనంత‌రం కాంగ్రెస్ పార్టీకి గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ముందే ఊహించిన ఆయ‌న 2014 ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందు సైకిలెక్కారు. టికెట్ ఆశించినా ఆయ‌న‌కు అధినేత నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పి అప్ప‌టికి సర్దుబాటు చేయ‌డంతో మ‌ల్లికార్జున‌రావు కూడా పార్టీ అభివృద్ధికి త‌న శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేశారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో రేప‌ల్లెలో అన‌గా స‌త్య‌నారాయ‌ణ ప్ర‌సాద్‌, వేమూరులో మంత్రి న‌క్క ఆనంద‌బాబుల గెలుపున‌కు కృషి చేశారు.


 అయితే అధినేత చంద్ర‌బాబు ముందు చెప్పిన‌ట్లుగా ఆయ‌న‌కు ఎలాంటి నామినేటెడ్ ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేదు. దీనికి తోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సైతం ఆయ‌న‌కు టికెట్ ఇచ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆయ‌న తీవ్ర మ‌న‌స్తాపం చెందార‌ట‌. ఇదే విష‌య‌మై చంద్ర‌బాబును క‌లిసిన ఆయ‌న‌కు స‌రైన హామీ లభించ‌క‌పోవ‌డంతో  ఆయ‌న దారి ఆయ‌న చూసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానానికి తెనాలి నుంచి మ‌ల్లికార్జున‌రావును బ‌రిలోకి దించాల‌ని చంద్ర‌బాబు మొద‌ట అనుకున్నార‌ట‌. అక్క‌డి సిట్టింగ్ ఎమ్మెల్యేను గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించాల‌ని భావించార‌ట‌. అయితే ఎందుక‌నో చివ‌రికి వ‌ద్ద‌నుకున్న‌ట్లు తెలుస్తోంది.


 ఇక పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యం లేన‌ప్పుడు కొన‌సాగ‌డం వృథా అనుకున్న ఆయ‌న పార్టీ మారాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ ఇప్ప‌టికే నిండుకుండ‌లా ఆశావ‌హుల‌తో క‌నిపిస్తుండ‌టం, జ‌గ‌న్ తండ్రి వైఎస్సార్తో విబేధాలు ఉన్న ద‌రిమిలా ఆ పార్టీ క‌న్నా జ‌న‌సేన‌లోకి వెళ్తే ప్రాధాన్యంతో పాటు నాయ‌క‌త్వం వ‌హించ‌వ‌చ్చ‌న్న వ్యూహంతో  ఆపార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.రెండు రోజుల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మక్షంలో పార్టీ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు తెలుస్తోంది. రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిగా ఆయ‌న జ‌న‌సేన నుంచి పోటీ చేయ‌డం ఖాయంగా తెలుస్తోంది. అదే జ‌రిగితే ఇక్క‌డ కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్లు చీల‌నున్నాయి. 


కమ్మ సామాజిక వ‌ర్గం ఓట్లు కూడా బాగానే చీల‌నున్నాయ‌ని తెలుస్తోంది. గ‌తంలో ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా ప‌నిచేసిన అనుభ‌వంతో పాటు వ్య‌క్తిగ‌తంగా మంచి ఇమేజ్ ఉండ‌టంతో ఆయ‌న గెలిచిన గెల‌వ‌చ్చు అనే భావ‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌వేళ ఆయ‌న గెల‌వ‌కున్న గెలుపోట‌ముల‌ను మాత్రం తీవ్రంగా ప్ర‌భావం చేయ‌గ‌ల‌రు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: