ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజైంది. పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించేస్తున్నాయి. కానీ బెజవాడలో మాత్రం వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ చిత్రంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. నా సీటు నాకివ్వరా అంటూ వైసీపీ నుంచి బయటకొచ్చిన రాధా పరిస్థితి ఇప్పుడు రెంటీకి చెడ్డ రేవడిలా తయారైంది. 
అర్థరాత్రి లగడపాటితో పాటు చంద్రబాబును కూడా కలిసి మంతనాలు జరిపారు రాధా.

దీంతో వంగవీటి తెలుగుదేశం కండువా కప్పుకోవడం  దాదాపు ఖాయమనే తేలిపోయింది. కానీ కోరుకున్న సీటు మాత్రం వంగవీటిని వరించే అవకాశాలు లేవు. చంద్రబాబు రాధాను మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ  చేయమని చెబుతున్నట్లు తెలుస్తోంది.  నిజానికి మచిలీపట్నం సీటు ఇవ్వడానికి వైసీపీ మొగ్గుచూపింది. అంతా మేం చూసుకుంటాం అంటూ హామీ ఇచ్చింది. కానీ దాన్ని గుదిబండగా భావించిన వంగవీటి వైసీపీకి గుడ్ బై చెప్పారు. జగన్ పై కారాలు మిరియాలు నూరారు.

కానీ ఇప్పుడు టీడీపీలో మళ్లీ అదే ఎంపీ సీటు నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చేట్టుంది. దీంతో వద్దనుకున్న లంపటం మళ్లీ నాకు తగులుకుందేంటా అని రాధా తెగ వర్రీ అయిపోతున్నాడట. కనీసం వైసీపీలో ఉంటే పార్టీ మద్దతైనా దక్కేది కదా అని తెగ బాధపడిపోతున్నాడట.  కానీ ఏం చేయలేని స్థితి. ఇక ఇప్పుడు రాధా ఫ్యాన్ కింద కూర్చోవడం కాదు సైకిలెక్కి రోడ్డెమ్మట పడాల్సిందే... 


మరింత సమాచారం తెలుసుకోండి: