తెలంగాణలో శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొదటి ఓటు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి వేశారు. రెండో ఓటును తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వేశారు. మొత్తం ఐదు స్థానాల కోసం ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్ -1లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.


ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. టీడీపీ , బీజేపీ మండలి ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. పోటీలో నిలిచిన అభ్యర్థులు శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎగ్గె మల్లేశం, మజ్లిస్ అభ్యర్థి మీర్జా రియాజుల్ హసన్ శాసనసభ ప్రాంగణానికి వచ్చారు. ఓటింగ్ కు విపక్షాలు దూరంగా ఉండటం వల్ల ఐదుగురు అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే.


కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచిన కాంగ్రెస్, తెదేపా తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. తెరాస ఎమ్మెల్యేందరూ తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఐదు విడుతలుగా వెళ్లి ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. టీఆర్‌ఎస్‌కు నామినేటేడ్‌ శాసనసభ్యుడితో కలిపి 91 మంది బలం ఉంది.
ఎంఐఎంకు చెందిన ఏడుగురితో కలుపుకుంటే 98 మంది ఉన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియ, చిరుమర్తి లింగయ్య, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించినందువల్ల కాంగ్రెస్, తెదేపా తిరుగుబాటు సభ్యుల అవసరం లేకుండానే గెలవాలని టీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: