ఏపీ సీఎం చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన తెలంగాణ సీఎం, అక్క‌డి అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అనుకున్న‌ది సాధిస్తున్నారా?  నిజంగానే చంద్ర‌బాబుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు పావులు క‌దుపుతున్నారా? ఏపీలో టీడీపీని ఓడిస్తామంటూ.. ప‌ట్టుద‌ల‌తో ఉన్న టీఆర్ ఎస్ అధినేత ఆదిశ‌గానే అడుగులు వేస్తున్నారా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అనిపిస్తున్నాయి. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో టీఆర్ ఎస్ పార్టీ ఊసు కానీ, ఊపు కానీ లేవు. గ‌త ఏడాది డిసెంబరులో టీఆర్ ఎస్ తెలంగాణాలో ఘ‌న విజ‌యం సాధించినవిష‌యం తెలిసిందే.


ఈ క్ర‌మంలో ఏపీలోని ప‌లు జిల్లాల్లో కొంద‌రు వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు పాలాభిషేకం చేశారు. ఆ త‌ర్వాత టీఆర్ ఎస్‌కు చెందిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వంటివారు ఏపీకి రావ‌డం, కుల సంఘాలు, పెద్ద‌ల‌తో చ‌ర్చ పెట్ట‌డం కూడా తెలిసిందే. అయితే, పార్టీ మాత్రం ఇక్క‌డ ఎక్క‌డా జెండా ఎగ‌రేసిన దాఖ‌లా లేదు. కానీ, ఇప్పుడు ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసిన త‌ర్వాత అనూహ్య ప‌రిణామం తెర‌మీదికి వ‌చ్చింది. ఏపీలోనూ టీఆర్ ఎస్ పోటీ చేస్తుంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 


అంతేకాదు, ఏపీ రాజ‌ధాని ప్రాంత‌మైన  విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్ ఎస్ పార్టీ జెండాపై పోటీ చేసేందుకు తాను సిద్ధం అంటూ..  కొణిజేటి ఆదినారాయణ అనే వ్య‌క్తి ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అంత‌కాదు, ఈయ‌న ఏకంగా బీఫామ్ కోసం హైదరాబాదు పయన‌మ‌య్యార‌నే వార్త‌లు కూడా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

ఇక‌, ఏపీలో  గెలుపొంది కెటిఆర్ కు గిఫ్టు గా ఏపి సీటు ఇస్తానంటూ కొణిజేటి చేసిన వ్యాఖ్య‌లు కూడా సంచ‌ల‌నం రేపుతు న్నాయి. వాస్త‌వానికి సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కుడు బొండా ఉమా ఉన్నాడు. ఈయ‌న‌పై పోటీకి వైసీపీ త‌ర‌ఫున మ‌ల్లాది విష్ను ఉన్నాడు. మ‌రి ఇప్పుడు టీఆర్ ఎస్ నాయ‌కూడా రంగంలోకి దిగితే.. పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: