మొత్తానికి నారా లోకేష్ పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుండే లోకేష్ పోటీ చేయబోతున్నారు. మొన్నటి వరకూ భీమిలీ నియోజకవర్గం అని చెప్పినా చివరి నిముషంలో అక్కడి నుండి విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గానికి మారారు. చివరి నిముషంలో నియోజకవర్గాన్ని ఎందుకు మార్చారో చంద్రబాబుకే తెలియాలి. అంటే భీమిలీ నుండి లోకేష్ గెలిచే అవకాశాలు పెద్దగా లేవని అంచనాకు వచ్చారట లేండి.

 

సరే ఏదెలాగున్నా చివరకు చినబాబుకు నియోజకవర్గమైతే ఖరారైనట్లే అని పార్టీ వర్గాలు చెప్పాయి. పోయిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బిజెపి శాసనసభాపక్షం నేత విష్ణుకుమార్ రాజు గెలిచారు. రాజుకు 82079 ఓట్లు వస్తే వైసిపి అభ్యర్ధి చొక్కుల వెంకట్రావుకు 63839 ఓట్లొచ్చాయి. అంటే పొత్తుల్లో భాగంగా పోయిన ఎన్నికల్లో ఈ సీటును టిడిపి వదిలేసుకుంది.

 

ప్రస్తుతం బిజెపి, టిడిపి, జనసేన విడిపోయాయి కాబట్టి మూడు పార్టీల నుండి అభ్యర్ధులు రంగంలో ఉంటారనటంలో సందేహం లేదు. విష్ణు వ్యవహారమే కాస్త అనుమానాస్పదంగా ఉంది.  ఏదేమైనా విశాఖ ఉత్తరం నుండి లోకేష్ గెలుపు అనుకున్నంత ఈజీ ఏమీ కాదని సమాచారం. ఎందుకంటే, విష్ణు బిజెపికి గుడ్ బై చెప్పేసి వైసిపిలో చేరుతారనే ప్రచారం బాగా జరుగుతోంది. నిజంగా అదేగనుక జరిగితే లోకేష్ గెలుపు అనుమానమే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: