విజయవాడ....ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధానిగా చెప్పుకుంటారు. దీంతో ప్రధాన పార్టీలు ఈ స్థానాన్ని కైవసం చేసుకోడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ తరపున కేశినేని నాని విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. తన సమీప వైసీపీ అభ్యర్ధి కోనేరు రాజేంద్ర ప్రసాద్‌పై సుమారు 75వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న విజయవాడ ఈస్ట్, సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేటలని కూడా టీడీపీ గెలుచుకుంది. అలాగే విజయవాడ వెస్ట్, తిరువూరులని వైసీపీ గెలుచుకుంది. ఇక ఈ సారి కూడా కేశినేని నాని టీడీపీ ఎంపీగా మరోసారి బరిలో ఉండనున్నారు. పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి మరోసారి తనని గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. ఆ పైగా రాజధాని నగరం అమరావతికి దగ్గర ఉండటంతో టీడీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో విజయవాడ రూపు రేఖలు మారిపోయాయని ప్రజలు కూడా చర్చికుంటున్నారు. 


ఈ క్రమంలో కేశినేని గెలుపు ఈసారి కూడా సులువే అని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ సారి విజయవాడ ఎంపీ స్థానాన్ని దక్కించుకోవాలని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పట్టుదలగా ఉంది. ఈ సారి నానికి చెక్ పెట్టి రాజకీయ రాజధానిని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జై రమేశ్‌ను తమ పార్టీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని వైసీపీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకూలిస్తే ఆయనే వైసీపీ తరుపున విజయవాడలో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.


అయితే తాజాగా విజయవాడ వైసీపీ అభ్యర్థి రేసులో మరో పారిశ్రామిక వేత్త పీవీపీ(పొట్లూరి వరప్రసాద్) పేరు తెరపైకి వచ్చింది. వైసీపీ తరపున సీటు దక్కించుకునేందుకు ఆయన రంగంలోకి దిగారని ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో వైసీపీ తరపున విజయవాడ ఎంపీ టికెట్ దాసరి జైరమేశ్‌కు దక్కుతుందా లేక పీవీపీకి దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.  ఇక పీవీపీ, దాసరిలో ఎవరు బరిలో ఉన్న నానికి గట్టి పోటీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇరువురు ఒకే సామాజికవర్గం వారు అలాగే ఆర్ధికంగా బలంగా ఉన్నవారు. మరి చూడాలి వైసీపీ తరుపున ఎవరు బరిలో దిగి నానికి చెక్ పెడతారో....లేక నానినే వైసీపీకి చెక్ పెడతారో...!


మరింత సమాచారం తెలుసుకోండి: