ఏపీలో ఎన్నికలు వచ్చేశాయి....అన్నీ పార్టీలలో రాజకీయ వేడి మొదలైంది. రాష్ట్రంలో ప్రధాన పోరు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య జరగనుండగా....కొన్ని చోట్ల వీరికి జనసేన గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలోనే రాజ‌ధాని కేంద్రం అయిన విజయవాడ తూర్పులో ఈ సారి త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు బలంగానే ఉన్నాయి. కాగా, విజయవాడ తూర్పు నుండి గత ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ రావు టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సారి కూడా ఆయనే టీడీపీ నుండి బరిలోకి దిగుతున్నారు. అయితే నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ వివాదరహితుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటారని మంచి పేరే తెచ్చుకున్నారు. ఇక టీడీపీ అంతర్గత సర్వేలో కూడా గద్దె రామ్మోహన్‌కు మంచి ర్యాంకు వచ్చింది. 


ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉన్న రామ్మోహన్‌కి ఈసారి గెలుపు అంత సులువు కాదనే చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చిన జనసేన ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తోంది. అలాగే టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకిత కూడా ఉంది. అటు వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. గతంలో యలమంచిలి రవి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఇక్కడి నుంచి గెలిచారు. దీంతో తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ర‌వికి మంచి ప‌ట్టు ఉంది. ఆయ‌న తండ్రి కాక‌లు తిరిన రాజ‌కీయ వాదిగా ఉండ‌టం, ఇక్క‌డ అనేక మందితో ప‌రిచ‌యాలు, బంధుత్వాలు ఉండ‌టం ఆయనకి క‌లిసివ‌చ్చే అంశం.


ఇటు జనసేన పార్టీ కూడా ఈ నియోజకవర్గంలో కొంత పట్టు ఉంది. కాని క్యాండెట్ ఎవరు అనేది సస్పెన్స్‌గా ఉంది. ఇక్కడ కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్లు సుమారు 40 వేల‌కు పైగా ఉన్నారు. కాబట్టి జ‌న‌సేన నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టిన‌ట్లయితే గెలుపు ఖాయ‌మ‌ని అంచ‌నాలు ఆ పార్టీ నాయ‌కులు వేస్తున్నారు. ఆపైగా 2009లో ప్రజారాజ్యం ఇక్కడ నుండి గెలుపొందింది. దీంతో తమ గెలుపు కూడా సులువే అని జనసేన నేతలు భావిస్తున్నారు. ఏది ఏమైనా తూర్పులో త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: