ఎన్నిక‌ల వేళ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా? ఒంట‌రిగానే బ‌రిలో దిగినా... త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకునేందుకు శ్ర‌మిస్తున్నారా?  ఎక్క‌డిక‌క్క‌డ త‌న స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సొంత జిల్లా ప‌శ్చిమ గోదావ‌రిలో త‌మ ప్ర‌భావం నిల‌బెట్టు కునేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నార‌ని తెలుస్తోంది. గ‌తంలో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించి పాల‌కొల్లు నుంచి పోటీ చేసి విజ‌యానికి దూర‌మ‌య్యారు. దీంతో ఇప్పుడు త‌మ్ముడు ప‌వ‌న్ మాత్రం ఇక్క‌డ త‌న స‌త్తా చాటి పోయిన ప్రాభ‌వాన్ని నిల‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. 


దీనిలో భాగంగానే ఆయ‌న త‌న సోద‌రుడు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు ప‌శ్చిమ గోదావ‌రిలోని కీల‌క‌మైన పార్ల‌మెంటు నియోజ క‌వ‌ర్గం న‌ర‌సాపురం టికెట్‌ను ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. న‌ర‌సాపురం అంటేనే క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా కూడా ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులే విజ‌యం సాధిస్తున్నారు. అయితే, ఇప్పుడు దీనికి భిన్నంగా జ‌న‌సేన త‌ర‌ఫున నాగ‌బాబు పేరు వినిపిస్తోంది. ఇక్క‌డ మెగా ఫ్యామిలీ అభిమానులు ఉన్న‌ప్ప‌టికీ.. ఏమేర‌కు అండ‌గా నిలుస్తార‌నేది వేచి చూడాల్సిన విష‌యం. అదేస‌మ‌యంలో ఇక్క‌డ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్న‌దీ లేనిదీనాగ‌బాబు స్ప‌ష్టం చేయ‌లేదు. ఒక‌వేళ పోటీ చేస్తే.. ఏమేర‌కు గెలుస్తార‌నేది కూడా ఉత్కంఠగా మారింది. 


ఇక‌, అదేస‌మ‌యంలో ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ప్రముఖ ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావును రంగంలోకి దించాలని భావిస్తున్నారు. జనసేనలో చేరిన ఆయన పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పోలవరం నిర్వాసితుల విషయంలో గిరిజనుల పక్షాన నిలిచి పోరాటం చేయడం ద్వారా పుల్లారావు పవన్‌ దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఆయన ఏలూరు లోక్‌సభ నుంచి బరిలోకి దింపితే ఒకవైపు సామాజికవర్గంగా, మరోవైపు విద్యావేత్తల నుంచి తగినంత మద్ధతు కూడగట్టుకోవచ్చని జనసేన వ్యూహంగా కనిపిస్తోంది. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం సైతం ఏలూరు లోక్‌సభ పరిధిలో ఉండడం తమకు కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇలా జ‌న‌సేనాని త‌న‌దైన వ్యూహంతో ఇక్క‌డ పావులు క‌దుపు తుండ‌డంతో రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: