విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం.... 2008 నియోజవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడింది. ఇక ఆ వెంటనే 2009 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున మల్లాది విష్ణు ఇక్కడ నుండి విజయం సాధించారు.  అలాగే 2014 ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి బొండా ఉమా 30 వేలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన గౌతంరెడ్డి పరాజయం పాలయ్యారు.అయితే ఈసారి సెంట్రల్‌లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మరో నెల రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ నుండి బొండా ఉమానే మరోసారి బరిలోకి దిగుతున్నారు. కానీ గత అయిదేళ్లుగా కాలంలో ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. ప్ర‌జ‌ల‌ను చుల‌క‌న‌గా చూడ‌డం, భూ క‌బ్జాలు లాంటి ఆరోప‌ణ‌లు బాగానే ఉన్నాయి.


కాకపోతే టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొంద‌డం....సెంట్రల్‌లో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలయ్యేలా చేయడం వంటివి బొండాకి మరోసారి సీటు వచ్చేలా చేశాయి. ఇక సెంట్రల్‌లో గట్టి పట్టు ఉన్న వంగవీటి రాధా ఇటీవల వైసీపీని వీడి టీడీపీని చేరేందుకు సిద్ధమవుతున్నారు. రాధా టీడీపీలో చేరడం ఖాయం కాబట్టి...సెంట్రల్‌లో ఆయన మద్ధతుదారులు ఉమాకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది.మరోవైపు సీనియర్ నేత, బ్రాహ్మణ సామాజిక వ‌ర్గానికి చెందిన మల్లాది విష్ణు వైసీపీ తరపున సెంట్రల్ బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారనుంది. 


విష్ణు కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుండి నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అలాగే విష్ణు సామాజికవర్గం వారు కూడా ఇక్కడ బాగానే ఉన్నారు. అలాగే టీడీపీ మీద వ్యతిరేకిత తనకి కలిసొస్తుందని మల్లాది భావిస్తున్నారు. కానీ రాధా టీడీపీలో చేరుతుండటంతో...ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్న కాపు ఓటింగ్ వైసీపీ వైపు మొగ్గు చూపడం కష్టమే. ఇక అటు విజయవాడ సెంట్రల్ నుండి జనసేన పోటీ చేస్తుందా లేక పొత్తులో భాగంగా వామపక్షాలు పోటీ చేస్తాయనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బొండా, మల్లాదిల మధ్యే ప్రధాన పోరు జరగనుంది. మరి చూడాలి ఎన్నికల్లో వీరి ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో...


మరింత సమాచారం తెలుసుకోండి: