`ఢిల్లీ గులాములు కావాలా? పోరాడేవారు కావాలా?`` ``కారు..సారు స‌ర్కారు``. ఇవి ఇటీవ‌లి కాలంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న కామెంట్లు. రాష్ట్రంలోని మొత్తం 17 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 16 చోట్ల టీఆర్ఎస్ పార్టీని, ఒక‌చోట‌ త‌మ మిత్ర‌ప‌క్షం ఎంఐఎంను గెలిపిస్తే...ఢిల్లీలో స‌త్తా చాటుతామ‌ని కేటీఆర్‌ ప్ర‌క‌టిస్తున్నారు. అయితే, కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌లు నిజంగా ఓట్లు రాలుస్తాయా?  గులాబీ పార్టీ చెప్పిన మాట‌ల ప్ర‌కారం, ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చ‌క్రం తిప్ప‌గ‌ల‌దా? అనేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారిన అంశం.


గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌ఫున గెలిచిన వారు, ఆ పార్టీలో చేరిన వారు క‌లుపుకొని టీఆర్ఎస్‌ చేతుల్లో 14సీట్లు ఉన్నాయి. అయితే, ఏం సాధించారు? అనే ప్ర‌శ్న‌కు ప్ర‌త్యేకంగా స‌మాధానం లేదు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే, కాళేశ్వరం కోసం రూ.24వేల కోట్లు అడిగితే 24పైసలు కూడా విదల్చలేదని సాక్షాత్తు కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. నిజానికి ఫెడరల్‌ ఫ్రంటు పేరు తప్ప దానికి అస్థిత్వం లేదు. ఇప్పటి వరకు ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరు మీద చర్చలు కూడా కాంగ్రెసుతో సన్నిహితంగా ఉన్న పార్టీలతోనే తప్ప, బీజేపీతో సన్నిహితంగా ఉన్నవారితో చేయలేదు. కాంగ్రెసు నాయకత్వంలోని మిత్ర బృందంలో చీలికలు తెచ్చి మోడీకి మేలు చేసేందుకే ఈ ప్రయత్నాలన్న అపవాదును మూటగట్టుకున్నారు కూడా!


పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి తీవ్ర నిర్ణయాలు కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్వాగతించింది. ప్రపంచ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అతితక్కువ స్థాయికి పడిపోయినప్పుడు కూడా దేశంలో మోడీ ప్రభుత్వం ఎప్పుడూ లేనంత ఎక్కువగా ధర పెంచింది. నిత్య జీవితావసర సరుకుల ధరల పెరుగుదలకిది దారితీసింది. అయినా టీఆర్‌ఎస్‌ నాయకత్వం పట్టించుకోలేదు. ఇలా కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌కు ప‌రోక్ష మ‌ద్ద‌తు ఇచ్చిన కేసీఆర్ సారు...ఇప్పుడు ఫ్రంట్ పేరుతో నిజంగా ప్ర‌త్యామ్నాయ స‌ర్కారును ఏర్పాటు చేయ‌గ‌ల‌రా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

పైగా, ఫెడరల్‌ ఫ్రంటు ఆలోచనలను ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మమతాబెనర్జీతో పంచుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ సరిగ్గా కేంద్రానికీ, బెంగాల్‌కూ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సమయంలో ముఖం చాటేసిన నేప‌థ్యంలో....ఫ్రంట్ పేరుతో మోడీ వ్య‌తిరేక ఎజెండాలో టీఆర్ఎస్ చిత్త‌శుద్ధిపై స‌హ‌జంగానే...అనుమాన‌పు మేఘాలు క‌మ్ముతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: