గల్లా జయదేవ్.... గుంటూరు మిర్చి ఘాటు ఎలా ఉంటుందో పార్లమెంటులో బీజేపీ వారికి చూపించిన నేత...గత ఎన్నికల్లో టీడీపీ నుండి గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్లమెంట్‌లో తనదైన శైలిలో ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీసి ఏపీ ప్రజల మనసుని గెలుచుకున్నారు. ఇక స్థానికేతరుడుగా గత ఎన్నికల్లో విజయం సాధించిన గల్లా...రాబోయే ఎన్నికల్లో కూడా గుంటూరు నుండే బరిలోకి దిగి విజయం సాధించాలని చూస్తున్నారు.


అయితే గల్లా ఎంపీగా గెలిచిన మొదట్లో స్థానికంగా ఎక్కువ అందుబాటులో లేరన్న విమర్శలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మాత్రం గల్లా అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఇక స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన గల్లాపై ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అటు ప్రత్యేక హోదా అంశంతో పాటు జిల్లాకు సంబంధించిన ఇతర అంశాలను పార్లమెంట్‌లో చర్చించి మంచి పేరే తెచ్చుకున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేశ్ మద్ధతు కూడా జయదేవ్‌కి పుష్కలంగానే ఉంది. కానీ స్థానికేతరుడు అనే ముద్రా ఆయన మీద ఇంకా ఉంది. దీన్నే వైసీపీ అస్త్రంగా చేసుకొనుంది.


మరోవైపు వైసీపీ తరపున గత ఎన్నికల్లో వల్లభనేని బాలశౌరి పోటీ చేసి ఓడిపోయారు. ఈ దఫా వైసీపీ తరపున లావు శ్రీకృష్ణ దేవరాయులు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ...తాజాగా టీడీపీ నుండి వైసీపీలో చేరిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మోదుగుల పార్టీలో చేరడమే గల్లాపై విమర్శలు చేశారు. గుంటూరు నుండి పోటీ చేసే గల్లాకి నా సత్తా ఏంటో చూపిస్తానని సవాల్ కూడా విసిరారు. అటు ఇక్కడ కాపు ఓటింగ్ ఎక్కువ ఉండటంతో జనసేన నుండి తోట చంద్రశేఖర్ పోటీ చేయడం ఖాయమైంది. మరి ఆయన టీడీపీ, వైసీపీలని తట్టుకుని ఏ మేర నిలుస్తారో చూడాలి.


ఇక గుంటూరు పార్లమెంట్ పరిధిలో గుంటూరు వెస్ట్, ఈస్ట్, తాడికొండ, పొన్నూరు, మంగళగిరి, ప్రత్తిపాడు, తెనాలి నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ 5, వైసీపీ 2 చోట్ల విజయం సాధించాయి. అలాగే ఈ లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో 15 లక్షల మంది ఓటర్లుంటే... ఇందులో కమ్మ, కాపు, ముస్లింల ఓటర్లు 9 లక్షల వరకు ఉన్నారు. వీరే గెలుపోటములని ప్రభావితం చేయగలరు. అలాగే రెడ్డి వర్గం వారు లక్ష, బీసీలు రెండు లక్షల, ఎస్సీలు మరో రెండు లక్షల, ఇతరులు మరో లక్ష మంది ఉన్నారు.అయితే ఈసారి ఏ పార్టీకి గెలుపు అంత సులువుగా రాదనే చెప్పాలి. మరి ఈ హోరాహోరీ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: