ఎన్నికలకి మరో నెల రోజులు ఉన్న నేపథ్యంలో నూజివీడు రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే వైసీపీ తరుపున ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు బరిలో ఉండగా..టీడీపీ తరుపున ఎవరు బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన ముద్దరబోయిన వేంకటేశ్వరరావు మరోసారి బరిలోకి దిగాలని చూస్తుండగా....ఆయన వ్యతిరేక వర్గం మాత్రం ముద్దరబోయినకి టికెట్ ఇవ్వొద్దని టీడీపీ అధిష్టానానికి గట్టిగానే చెబుతున్నారు.


ఇక టీడీపీ ఇక్కడ బీసీ నేతకే టికెట్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఒకవేళ బీసీ నేతగా ఉన్న ముద్దరబోయినకి ఇవ్వకుంటే కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుని బరిలోకి దింపే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి వీరిలో ఒకరికి టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీ నుండి టికెట్ ఫిక్స్ చేసుకున్న మేకా ప్రచారం కూడా ప్రారంభించేశారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండటం వలన ఎక్కువ పనులు చేయలేకపోయానని చెబుతూనే ప్రజల వద్దకి వెళుతున్నారు. ఈ క్రమంలోనే మరోసారి తనని గెలిపిస్తే...రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానని చెబుతున్నారు.


ఇక టీడీపీ గత ఎన్నికల మాదిరిగానే అభ్యర్ధిని ఇంకా ఖరారు చేయకుండా ఉండటం వైసీపీకి కలిసొచ్చే అవకాశం ఉంది. అసలు గత మూడు ఎన్నికల్లోనూ ఇదే తంతు. 2004 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కోటగిరి హనుమంతరావు ఓటమి తర్వాత 15 సంవత్సరాల్లో ఇప్పటికి ఇక్కడ టీడీపీ తరుపున బలమైన అభ్యర్థిని ఎంపిక చేయలేని దీనస్థితికి టీడీపీ దిగజారిపోయింది.  ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ  తరుపున ఎవరు పోటీ చేస్తారనేది తెలియకపోవడం వలన క్యాడర్ అయోమయంలో ఉంది.


అయితే అధికార పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ముద్రబోయిన  నియోజకవర్గంలో ఏ సమస్య  ఉన్నా చంద్రబాబు దగ్గరకు వెళ్లి పని చేయించుకున్నారు. కానీ నియోజకవర్గంలో వర్గపోరు కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇక ముద్రబోయిన కమ్మ సామాజికవర్గాన్ని దూరం చేసుకున్నారన్న విమర్శ ఉంది. గత ఎన్నికల్లో కూడా ఆ సామాజికవర్గమే ఆయన ఓటమికి కారణమైందని చెబుతుంటారు.


ఇక నియోజవర్గంలో ఉన్న ముసునూరు మండలం టీడీపీకి కంచుకోట. నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థితో సంబంధం లేకుండా ముసునూరు మండలం ఓటర్లు ఆ పార్టీ వైపే మగ్గు చూపుతున్నారు. అటు చాట్రాయిలో వైసీపీ ఆధిక్యత కనబరుస్తుంది. అలాగే నూజివీడు రూరల్‌ మండలం తెలుగుదేశం వైపు మగ్గు చూపుతుండగా,  ఆగిరిపల్లిలో వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. అయితే టీడీపీ అభ్యర్ధి త్వరగా ఖరారు అయ్యి ప్రచారంలోకి దిగితే వైసీపీని నిలవరించగలదు. మరి చూడాలి ఈసారి నూజివీడు ఓటర్లు ఎవరికి పట్టం కడతారో.


మరింత సమాచారం తెలుసుకోండి: