తెలుగుదేశం పార్టీకి మ‌రో ముఖ్య‌నేత గుడ్‌భై చెప్పే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. నరసరావుపేట పార్లమెంట్‌ స్థానంపై టీడీపీ అధిష్ఠానం నిర్ణ‌యం కారణంగా సిట్టింగ్ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు పార్టీకి గుడ్‌బై చెప్తార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు, మీడియాతో రాయ‌పాటి చేసిన వ్యాఖ్య‌లు దీనికి బ‌లం చేకూరుస్తున్నాయి. న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో పార్టీలో పీట‌ముడి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ సీటును సిట్టింగ్ ఎంపీ రాయ‌పాటి ఆశిస్తుండ‌గా...టీడీపీ అధ్య‌క్షుడు, సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌కు భ‌రోసా ఇవ్వ‌న‌ట్లు స‌మాచారం.


 బాబుతో స‌మావేశంలోనూ ఇదే స్పంద‌న రావ‌డంతో రాయ‌పాటి తాజాగా విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీడీపీ తీరుపై మండిప‌డ్డారు. అధిష్టానం మళ్లీ టికెట్‌ ఇస్తే మళ్లీ పోటీ చేస్తానని వెల్లడించారు. తనకు సీఎం చంద్రబాబుపై పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. నరసరావుపేట ఎంపీ సీటు సీఎం చంద్ర‌బాబుతో చ‌ర్చించాన‌ని అయితే, త‌న‌కు భరోసా ఇవ్వలేదని.. ఆలోచిస్తామని సీఎం చెప్పారని రాయపాటి అన్నారు.

న‌రసరావుపేట ఎంపీ టికెట్ విషయంలో నా కంటే సమర్థులు ఎవరున్నారని ఎంపీ రాయపాటి ప్రశ్నించారు. ఒకవేళ ఉన్నట్లయితే వారికే టికెట్‌ ఇవ్వొచ్చని, ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. టికెట్‌ రాకపోతే సాయంత్రానికి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అయితే, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఖండించారు. తనతో ఏ పార్టీ సంప్రదింపులు జరపలేదని, వైసీపీ నాయకులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని రాయపాటి పేర్కొన్నారు. 


అయితే, నరసరావుపేట పార్లమెంట్‌ స్థానంపై టీడీపీ అధిష్ఠానం నుంచి హామీ రాకపోవడంపై రాయపాటి అసంతృప్తిగా ఉన్న నేప‌థ్యంలో వైసీపీ- రాయ‌పాటి కుటుంబం మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. వైసీపీ తరపున రాజ్యసభ కు రాయపాటిని పంపి కుమారుడికి అసెంబ్లీ ఇస్తారని ప్రచారం జ‌రుగుతోంది. మ‌రోవైపు రాయపాటి వైసీపీలోకి వస్తే సమీకరణాలు మారనున్నాయి. వైసీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థితో పాటుగా, సత్తెనపల్లి అభ్య‌ర్థి కూడా మారే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: