టీఆర్ఎస్ పార్టీ నాయ‌కురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌రుగుతున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నిజామాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, దేశ ప్రజలు జాతీయ పార్టీలు వద్దు.. లోకల్ పార్టీలు ముద్దు అనుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమస్యలు, ప్రజలు ముఖ్యమ‌ని. అదే జాతీయ పార్టీలకు ఎన్నో అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు తెలంగాణ అంశాలపై టీఆర్ఎస్ ప్ర‌త్యేక దృష్టి పెట్టింద‌న్నారు. 


తమ ఐదేళ్ల ప‌ద‌వీ కాలంపై ఎంపీ క‌విత ఈ సంద‌ర్భంగా వివ‌ర‌ణ ఇచ్చారు. ``విభజన హామీలపై పోరాటం చేశాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు తక్కువగా ఉంటే ఆ సంఖ్య పెంచమని కేంద్రం చుట్టూ తిరిగాం. హక్కు భుక్తంగా రావాల్సిన ఎయిమ్స్ ను ఢిల్లీ చుట్టూ తిరిగి సాధించుకున్నాం. నిజామాబాద్ రైల్వే లైన్ నిధులు సాధించి..పూర్తి చేశాం. కాంగ్రెస్‌, బీజేపీ దొందూ దొందే. ఒకే నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివి ఆ పార్టీలు...వాళ్ళు చేసిందేమీ లేదు కాబట్టి, వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి మందిరం,మసీద్, బోఫోర్స్, రాఫెల్ అంశాలను తెరపైకి తీసుకు వస్తున్నారు. మమ్మల్ని ఢిల్లీకి ఆశీర్వదించి పంపిస్తే...తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతాం`` అని తెలిపారు. 


ఇప్పుడు 16 టీఆర్ఎస్, 1 ఎంఐఎం అభ్యర్థులను గెలిపిస్తే..సైనికుల్లా పనిచేస్తామ‌ని ఎంపీ క‌విత హామీ ఇచ్చారు. ``గతంలో ఇద్దరు జేడీఎస్ ఎంపీలు గెలిస్తే, ఒకరు ప్రధాని అయ్యారు.ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించాం.కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. మన కేసీఆర్ లీడర్..దేశాన్ని సరైన మార్గంలో నడిపించడమే కాక మంచి మార్గం లో నడుపుతాడు. సీఎం కేసిఆర్‌కు విజన్, దార్శనికత ఉంది. అది దేశానికే దిశానిర్దేశం..ఫెడరల్ ఫ్రంట్ పెట్టిందే దేశ ప్రజల కోసం. కాంగ్రెస్ వాళ్లు మా పార్టీ బీజేపీకి బి - టీమ్ అంటున్నారు...బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కు బి- టీమ్ అంటున్నారు.. కానీ మేం తెలంగాణ ప్రజలకు బి - టీమ్..`` అని వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: