తెలుగుదేశం పార్టీని మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీడటంతో మంత్రి శిద్ధా రాఘవరావుకి బంపర్ ఆఫర్ తగిలేలా కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు మాగుంటని ఒంగోలు ఎంపీగా పోటీ చేయిద్దామని అనుకున్నారు. కానీ దీనిపై మాగుంట ఆసక్తి కనపరచలేదు. ఆ పైగా కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండి వైసీపీలో చేరి..ఆ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో బాబు కొత్త ఎత్తుగడ వేసి మంత్రి శిద్ధాని ఒంగోలు బరిలో నిలపాలని కోరారు. ఇక సీఎం ప్రపోజల్‌కి శిద్ధాకి ఇష్టం లేకపోయిన...తన సొంత నియోజకవర్గం దర్శిని వదులుకుని.. ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.


అయితే శిద్ధాని వదులుకోడానికి దర్శి కార్యకర్తలు, ప్రజలు సిద్ధంగా లేరు. దర్శిలో శిద్ధా కాకుండా మరి ఎవరినైనా దింపితే వాళ్ళని ఓడిస్తామని బాహాటంగా చెప్పేశారు. అలాగే వేలాది మంది కార్యకర్తలు రాజధాని అమరావతి వెళ్ళి... ఆందోళన కార్యక్రమాలు చేశారు. శిద్ధానే మళ్ళీ దర్శిలో పోటీ చేయాలని నినాదాలు చేశారు. లేదంటే రాజీనామా కూడా చేస్తామని అన్నారు. ఒకవేళ శిద్ధాని ఒంగోలు పంపాలనుకుంటే..దర్శిలో ఆయన కుటుంబ సభ్యులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో అక్కడే ఉన్న శిద్ధా...వారి దగ్గరకి వెళ్ళి సముదాయించి...అధినేతకి పరిస్థితులని వివరించి ఒప్పిస్తానని కార్యకర్తలకి మాట ఇచ్చారు. అయిన కార్యకర్తలని నియింత్రించడం శిద్ధా వల్ల అవలేదు.


దీంతో శిద్ధా దీని గురించి చంద్రబాబుతో భేటీ అయ్యారు. పరిస్థితులని వివరించారు. ఇక అన్నీ విన్న సీఎం దర్శిని కూడా కుటుంబ సభ్యులకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు శాంతించారు. అయితే దర్శి సీటుని శిద్ధా భార్య లక్ష్మి పద్మావతిగాని తనయుడు సుధీర్ గాని ఇస్తారని సమాచారం. దీనిపై రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి శిద్ధా ఎంపీతో పాటు, ఎమ్మెల్యే సీటు దక్కించుకుని బంపర్ ఆఫర్ కొట్టేశారని అనుకుంటున్నారు.  

  


మరింత సమాచారం తెలుసుకోండి: