తెలుగుదేశం పార్టీ యువ‌నేత‌, మంగ‌ళ‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి నారా లోకేష్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లుపెట్టారు. అమరావతిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, మంగళగిరి ఇంచార్జ్ గంజి చిరంజీవి, తెదేపా నాయకులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ మాట్లాడుతూ, చాలామంది నన్ను రాయలసీమ నుంచి పోటీ చేయమని సూచించారని, అయితే, మంగళగిరి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడం నా అదృష్టమ‌ని పేర్కొన్నారు. 1989 నుంచి మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ గెలవలేదని, ఈ ద‌ఫా గెలుపొందాల‌ని టీడీపీ వ‌ర్గాలు పట్టుద‌ల‌గా ఉన్నాయ‌న్నారు. 


ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న కష్టానికి అంతా అండగా నిలవాలని లోకేష్‌ కోరారు. రాజధాని ఇక్కడకి వస్తుంటే కొందరు అడ్డుకున్నారని, అయినా రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రధాని మోడి బుల్లెట్ ట్రైన్ కోసం ఒక్క ఎకరా భూమి సేకరించలేకపోయారని ఎద్దేవా చేశారు. వైకాపా అద్భుతమైన డ్రామా కంపెనీ అని లోకేష్ ఎద్దేవా చేశారు. మొదటి డ్రామా చివరి ఏడాదిలో ఎంపీల రాజీనామాలు అయితే, రెండో డ్రామా కోడికత్తి ఘటన అని అన్నారు. ఈ డ్రామా  చేసింది వైకాపా కార్యకర్త అని, దానికి త‌మపై నిందలు వేసి... ఎన్.ఐ. ఏ కు కేసు విచారణ అప్పగించగా....దాడి చేసింది వైకాపా కార్యకర్త అని ఎన్.ఐ.ఏ తేల్చిందన్నారు. మంగళగిరి ప్రాంతంలో ఐటి కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. మంగళగిరిని మరో గచ్చిబౌలిగా మారుస్తాన‌ని హామీ ఇచ్చారు. 


తాను నియోజకవర్గంలో అందరికి అందుబాటులో ఉంటాన‌ని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిచేస్తాన‌ని హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా మారుస్తాన‌ని తెలిపారు. 25 రోజులు కష్ట పడి గెలిపించండి జీవితాంతం రుణపడి పనిచేస్తానన్నారు.  తాను మంగళగిరి కి వచ్చి మూడేళ్లయిందని, త‌నతో పాటు సీఎం ఓటు కూడా ఇక్కడే ఉందని లోకేష్ తెలిపారు. అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకు వచ్చామ‌ని, అదే తరహాలో మంగళగిరి చేనేతకు బ్రాండ్ ఇమేజ్ తీసుకువస్తామ‌ని లోకేష్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: