విజయవాడ నగరానికి దగ్గరగా ఉండి...అభివృద్ధిలో దూసుకుపోతున్న నియోజకవర్గం పెనమలూరు. 2009లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గం (అంతకముందు ఉయ్యూరు) నుండి కాంగ్రెస్ తరుపున పార్థసారథి విజయం సాధించారు. కేవలం 177 ఓట్ల తేడాతో టీడీపీ నేత చలసాని వెంకటేశ్వరరావు ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడ నుండి బోడే ప్రసాద్ సుమారు 31 వేల పైనే ఓట్ల తేడాతో సమీప వైసీపీ అభ్యర్ధి కుక్కల విద్యాసాగర్‌పై విజయం సాధించారు.


ఈ సారి ఎన్నికల్లో బోడే ప్రసాద్ మళ్ళీ టీడీపీ నుండి పోటీ చేస్తుండగా...వైసీపీ నుండి పార్థసారథి పోటీ చేస్తున్నారు. ఇక ఇద్దరు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తూ ప్రజలని ఓట్లు అడుగుతున్నారు.అయితే గత ఐదేళ్లలో పెనమలూరు రాజధాని ప్రాంతానికి దగ్గర ఉండటంతో అన్నీ రకాలుగా అభివృద్ధి పథంలో నడిచింది. రోడ్లు, ఎన్టీఆర్ ఇళ్ళుమ అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలు జరిగాయి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ బాగానే అమలయ్యాయి. కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది. కానీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ఇసుక మాఫియా, కాల్ మనీ లాంటి స్కామ్‌లో బోడే కూడా ఉన్నారని ప్రతిపక్షాలు చేసిన  ఆరోపణలు ఉన్నాయి.


మరోవైపు వైసీపీ నుండి ఈసారి గెలిచి తీరాలని పార్థసారథి పట్టుదలతో ఉన్నారు. గతంలో ఇక్కడ నుండి గెలిచిన సారథి మంత్రి కూడా అయ్యారు. దీంతో ఈ నియోజకవర్గంపై పట్టు ఉంది. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకిత, జగన్‌కి పెరిగిన ప్రజాబలం తన గెలుపుకి దోహదపడతాయని భావిస్తున్నారు. అయితే గతంలో స్వల్ప మెజారిటీతో గెలిచి మంత్రి అయిన సారథి....నియోజకవర్గానికి చేసింది ఏమీలేదని విమర్శలు ఉన్నాయి. త్రాగునీరు వంటి ప్రధాన సమస్యని కూడా ఆయన పరిష్కరించలేదన్న అసంతృప్తి కూడా ఉంది.


కాగా, ఇక్కడ ఓటర్లలో బీసీలు ఎక్కువ శాతం ఉంటారు. ఆ తర్వాత స్థానంలో ఎస్సీలు ఉంటారు. ఇక కమ్మ సామాజికవర్గం కూడా ఎక్కువే ఉన్నారు. వారు సుమారు 30 వేల మంది ఓటర్లు ఉంటారు. ముస్లింలవి 20 వేల ఓట్లు ఉంటాయి. ఈ నియోజకవర్గం ఓటర్లు ఎక్కువ టీడీపీ వైపే మొగ్గు చూపుతారు. అయితే ఈసారి పరిణామాల్లో పెనమలూరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: