ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం రంజుగా మారింది. ఇక్క‌డ ఈ సారి పోటీ నువ్వా నేనా అన్న రీతిలో సాగ‌నుంది. టీడీపీ-వైసీపీ బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు వేదిక‌కానుంది.ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఐదుసార్లు పోటీ చేసి నాలుగుసార్లు విజ‌యం  సాధించిన బాలినేని శ్రీనివాస‌రెడ్డి మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.1999, 2004, 2009, 2012 ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న వ‌రుస‌గా విజ‌యం సాధిస్తూ వ‌చ్చారు. అయితే గ‌త 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి దామ‌ర‌చ‌ర్ల జ‌నార్ధ‌న్‌పై ఓట‌మిపాల‌య్యారు. రాజ‌కీయ ఉద్దండుడిగా  పేరు గాంచిన ఆయ‌న‌కు ఇది చాలా ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఒంగోలు జిల్లాలోనే సీనియ‌ర్ నేత‌గా కొన‌సాగుతున్న శ్రీనివాస‌రెడ్డి ఈ సారి ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.


 అయితే మాజీ మంత్రి, దివంగ‌త నేత దామ‌ర‌చ‌ర్ల ఆంజ‌నేయులుకు స్వ‌యంగా మ‌నవాడైన జ‌నార్ధ‌న్ కూడా రాజ‌కీయ వార‌స‌త్వానికి బ‌ల‌మైన పునాదులు వేసుకోవాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి తీరాల్సిన ప‌రిస్థితి. ఇలా ఇద్ద‌రు నేత‌ల‌కు ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌విగా చెప్ప‌వ‌చ్చు. దామ‌ర‌చ‌ర్ల గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి స‌త్తా చాటుకున్నారు. టీడీపీ అధికారంలోకి రావ‌డంతో ప్ర‌భుత్వ ప‌రంగా ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న చేప‌ట్టారు. వంద‌ల‌కోట్ల రూపాయాల‌తో రోడ్లు, భ‌వ‌నాలు, సైడ్ కాల్వ‌ల నిర్మాణం, తాగునీటి వ‌స‌తి, వంతెన‌లు, సీసీరోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి ప‌నుల‌తో పాటు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను అర్హులంద‌రికీ అందేలా చూడ‌గ‌లిగారు. 


రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన బాలినేని టీడీపీ వ్యూహాత్మ‌క అడుగుల‌ను క‌నిపెడుతూ క్యాడ‌ర్‌ను బ‌లోపేతం చేసుకోవ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. టికెట్ విష‌యంలో ఫుల్ క్లారిటీ ఉండ‌టంతో ఆయ‌న‌కు పార్టీలో కూడా పెద్ద‌గా అస‌మ్మ‌తి సెగ త‌గిలే ప‌రిస్థితి లేదు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను గెలిచి తీరాల్సిదేన‌న్న క‌సితో ముందుకు వెళ్తున్నారు. ఇటు జ‌నార్ధ‌న్ కూడా త‌న‌కు మ‌ళ్లీ తిరుగులేద‌ని చాటిచెప్పాల‌ని భావిస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ-టీడీపీల మ‌ధ్యే ప్ర‌ధాన పోరు జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంగా బీజేపీ కూడా ఇక్క‌డ పోటీకి సిద్ధ‌ప‌డుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి బీజేపీ మ‌ద్ద‌తు ప‌లికింది. ఈసారి సొంతంగా పోటీ చేసేందుకు అభ్య‌ర్థుల పేర్ల‌ను ఆ పార్టీ అధినాయ‌క‌త్వం పరిశీలిస్తోంది. అయితే కొన్ని ఓట్ల‌ను చీల్చి విజ‌య‌వ‌కాశాల‌ను దెబ్బ‌తీయ‌గ‌లిగే ప‌రిస్థితిలో పార్టీ ఉంద‌ని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: