చ‌దువుకునే విద్యార్థులు ఎలాగైతే....వార్షిక ప‌రీక్ష‌లో త‌ప్పితే స‌ప్లిమెంట‌రీ వైపు చూస్తారో అదే రీతిలో కాంగ్రెస్‌లోని కొంద‌రు సీనియ‌ర్లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు చ‌మ‌త్క‌రిస్తున్నాయి. మార్చిపోతే సెప్టెంబ‌ర్‌..సెప్టెంబ‌ర్ పోతే మార్చి అన్న‌ట్లుగా విద్యార్థులు త‌మ ప‌ట్టువిడ‌వ‌ని ప్ర‌య‌త్నం చేసిన‌ట్లే....హ‌స్తం పార్టీ నేత‌లు సైతం ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు. తాజాగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న నాయ‌కుల గురించి ఈ చ‌ర్చ జ‌రుగుతోంది.
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం ఢిల్లీలో సమావేశమై తెలంగాణ‌లోని 17 లోక్‌సభ స్ధానాల అభ్య‌ర్థుల గురించి చ‌ర్చించి 8 మంది పేర్ల‌ను ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే.

తెలంగాణలో ఎనిమిది లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గాల అభ్యర్థుల మొదటి జాబితాలో ఆదిలాబాద్-రమేష్ రాథోడ్, కరీంనగర్-పొన్నం ప్రభాకర్, మహబూబాబాద్-బలరాం నాయక్‌, మ‌ల్కాజిగిరి-రేవంత్ రెడ్డి, జహీరాబాద్-మదన్ మోహన్, చేవెళ్ల- కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్-. గాలి అనిల్ కుమార్, పెద్దపల్లి -ఎ.చంద్రశేఖర్ ఉన్నారు. అయితే, వీరిలో ఐదుగురు ఇటీవ‌ల జ‌రిగిన ముద‌స్తు ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌యిన వారే.


ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంపీ బ‌రిలో నిలిచిన వారిలో రమేష్‌రాథోడ్‌, బలరాం నాయక్‌, పొన్నం ప్రభాకర్‌, రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఖానాపూర్‌, మహబూబాబాద్‌, కరీంనగర్‌, కొడంగల్‌ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓడిపోయిన వీరిని తిరిగి లోక్‌సభ అభ్యర్థులుగా పార్టీ ఎంపిక చేసింది. తెరాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన తాజా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి తిరిగి చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం దక్కింది. విద్యార్థుల‌కు ఒక చాన్స్ పోతే మ‌రో చాన్స్ ద‌క్కిన‌ట్లు వీరికి సైతం మ‌ళ్లీ అవ‌కాశం ఇచ్చార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: