ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని షాక్ త‌గ‌ల‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న ఆప్తుడు, తెలంగాణ‌లో `మిగిలిఉన్న‌` ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రు ప‌చ్చ‌పార్టీకి గుడ్‌బై చెప్పి అధికార టీఆర్ఎస్ గూటికి చేరనున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో పార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని త‌న దారి తాను చూసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఆ ముఖ్య నేతే ఖమ్మం మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నేత నామా నాగేశ్వర్‌రావు.
వివిధ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, నామా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది.

ఆయన ఉంటే ఖమ్మం నుంచి బరిలోకి దిగాలని తొలుత భావించారు. అయితే టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిసి తనకు ఖమ్మం లేదా మల్కాజ్‌గిరి సీటు ఇవ్వాలని కోరారని ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతున్నది. ఈనేపథ్యంలో నామా ఉంటారా ? వెళతారా ? అనేది తేలాల్సి ఉంది.
మ‌రోవైపు నామా చేరిక వెనుక మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఉన్నార‌ని స‌మాచారం. తెలంగాణ ఆవిర్భావం అనంతరం తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరి కీలకనేతగా కొనసాగుతుండగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ వైపు చూస్తున్న నామాను టీఆర్‌ఎస్‌లో చేరేలా తుమ్మల పావులు కదిపారు.

తాజా రాజకీయపరిస్థితుల నేపథ్యంలో సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న తుమ్మల నాగేశ్వరరావు అనూహ్యంగా నామా నాగేశ్వరరావు చేరికకు లైన్‌ క్లియర్‌ చేయించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి పరిస్థితిని తీసుకెళ్ళి సానుకూల సంకేతాలు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. అనూహ్య రాజకీయాల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పేరు తెరపైకి రానుంద‌ని చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: