కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ బూతం పడగవిప్పుతోంది. టిడిపి, వైసిపి వర్గాల మధ్య ఘర్షణలో టిడిపి అభ్యర్ధికి బుల్లెట్ గాయమవటం సంచలనంగా మారింది. జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్ధితులు తలెత్తాయి. రాబోయే ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేస్తున్న తిక్కారెడ్డి ప్రచారంలో భాగంగా కగ్గల్ గ్రామానికి వెళ్ళారు. నియోజకవర్గంలో వైసిపి వర్గాలతో తిక్కారెడ్డకి పాతకక్షలున్నాయి.

 

ఎన్నికల వేడి రాజుకుంది కదా ? అందుకనే తిక్కారెడ్డి ప్రచారానికి వచ్చినపుడు అభ్యర్ధి మద్దతుదారులకు, వైసిపి వర్గాలకు మధ్య వివాదం మొదలైంది. దాంతో చిన్న వివాదం కాస్త పెద్ద గొడవగా మారి ఒకళ్ళపై మరొకళ్ళు దాడులు చేసుకునేదాక వెళ్ళింది. వివాదంలో తిక్కారెడ్డిపై వైసిపి వర్గాలు దాడులు చేశాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. దాడి చేసిందెవరు అన్న విషయం స్పష్టత లేకపోయినా దాడిజరిగింది మాత్రం వాస్తవం.

 

వైసిపి వాళ్ళే తమపై వేటకొడవళ్ళతో దాడులు చేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఎటూ ఫ్యాక్షన్ నియోజకవర్గమే కాబట్టి తిక్కారెడ్డి మనుషులు కూడా రెడీగానే ఉండుంటారు. అందుకనే వాళ్ళు వేటకొడవళ్ళతో దాడులు చేయగానే టిడిపి వాళ్ళు కూడా ఎదురుదాడి మొదలుపెట్టారు. దాంతో గుంపును చెదరగొట్టేందుకు తిక్కారెడ్డి గన్ మెన్ కాల్పులు జరిపారు. ఎవరు కాల్చారో ఏమో తెలీదు కానీ తిక్కారెడ్డి ఎడమకాలు తొడపైన బుల్లెట్ గాయమైంది.

 

కడప జిల్లాలోని పులివెందులలో వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఇపుడేమో మంత్రాలయంలో టిడిపి అభ్యర్ధిపై దాడులు. వ్యవహారం చూస్తుంటే పై రెండు ఘటనలు కూడా జరగబోయే ఉపద్రవానికి ఏదో శాంపిల్ లాగే కనబడుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలాగున్నాయో అన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: