రాష్ట్రంలో వివాదాలతో సహవాసం చేస్తున్న నేత ఎవరు అని అడిగితే...అందరూ ఠక్కున దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు చెబుతారు. అంతలా ఆయన చుట్టూ వివాదాలు ఉన్నాయి. ఇసుక వివాదం, నాయకులపై దూషణలు, ఉద్యోగులపై దూషణలు, ఇసుక వివాదంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఇలా పలు వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. ఇక తాజాగా దళితులని మంచి ఉద్దేశంతోనే అన్న..అవి కూడా చాలా దూరమే వెళ్ళాయి. ఇన్ని వివాదాలు ఉన్న ఆయనకి ప్రజలు రెండుసార్లు పట్టం కట్టారు. 2009, 14లలో ఆయన 15 వేల పైనే మెజారిటీతో విజయ బావుటా ఎగరవేశారు. ఇక ఈసారి ఎన్నికల్లో కూడా ఆయనే టీడీపీ బరిలో నిలబడి మరోసారి విజయం సాధించాలని చూస్తున్నారు.


ఎన్ని వివాదాలు ఉన్న నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ది కార్యక్రమాల తీరు ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించే ఎమ్మెల్యేగా చింతమనేనికి పేరుంది. అలాగే అనుకున్న పనికోసం ఎన్ని విమర్శలు ఎదురైనా పూర్తి చేయడమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తారు.  ఇక చింతమనేని దూకుడే జనంలో క్రేజ్ తీసుకొచ్చింది. అసలు ఆయనకి ఎప్పుడు ఎన్నికల టెన్షన్ పెద్దగా ఉండదనే చెప్పాలి. తను ప్రజలకి చేసిన మేలే గెలిపిస్తుందని ధీమాగా ఉంటారు. ఇప్పుడు కూడా ముచ్చటగా మూడొసారి దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ తరుపున పోటిలో బరిలో దిగి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. కానీ నిత్యం వివాదాల్లో ఉండే చింతమనేని ప్రభాకర్‌పై ప్రజల్లో, కేడర్‌లో అక్కడక్కడా కొంత వ్యతిరేకత వచ్చింది.


మరోవైపు వైసీపీ పశ్చిమలో పాగా వేసేందుకు జిల్లా మొత్తంపై పెట్టిన ఫోకస్ ఒక ఎత్తయితే దెందులూరుపై పెట్టిన ఫోకస్ మరోఎత్తుగా కనిపిస్తోంది. ఆయన్ని ఈసారి ఎలా అయిన ఓడించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈసారి వైసీపీ నుండి చింతమనేని సామాజికవర్గానికి చెందిన అబ్యయ్య చౌదరిని బరిలోకి దించుతుంది. ప్రస్తుతం వైసీపీ నుంచి చింతమనేనిపై పోటిచేయబోతున్న అబ్యయ్యచౌదరి ఆ పార్టీకి కొత్తే అయినా గ్రామలవారిగా నాయకుల్లో,కార్యకర్తల్లో గెలుపుపై నమ్మకం కుదిరేలా మీటింగులు బాగానే ఏర్పాటు చేశారు. అలాగే ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకిత వైసీపీని గెలిపిస్తాయని చూస్తున్నారు. అయితే పాలకొల్లుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పేరు కూడా వైసీపీ జాబితాలో పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరిని బరిలో ఉంచిన చింతమనేనిని ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పని చేస్తోంది.


అటు చింతమనేని అంతుచూస్తానంటూ సవాళ్ళు విసిరిన జనసేనాని కూడా ధీటైనా అభ్యర్ధిని బరిలోకి దించాలని చూస్తున్నారు. అయితే ప్రధాన పోరు మాత్రం టీడీపీ-వైసీపీల మధ్యే ఉంటుంది. కాగా, ఈ నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువుగా ఉన్నాయి. అలాగే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ప్రభావం గ్రామీణ ప్రజలపై అధిక ప్రభావాన్ని చూపుతుంది. మరి చూడాలి చింతమనేని హ్యాట్రిక్ కొడతారో లేక వైసీపీ పాగా వేస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: