పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని ఏలూరు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుంది. ఈ సెంటిమెంట్ 1989 నుండి కొనసాగుతూ వస్తుంది. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచి అధికరంలోకి వచ్చింది. ఆ తర్వాత 1994, 99లలో టీడీపీ, 2004, 2009లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చాయి. ఇక 2014 ఎన్నికలో ఇక్కడ నుండి టీడీపీ గెలిచి అధికారం సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ నుండి బరిలోకి దిగిన బడేటి కోటరామరావు(బుజ్జి)..తన సమీప వైసీపీ అభ్యర్ధి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని)పై 24వేల ఓట్లపైనే తేడాతో విజయం సాధించారు. ఈ సారి కూడా ఈ ఇద్దరే మరోసారి అవే పార్టీల నుండి ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇప్పటికే వీరు ప్రచారం కూడా మొదలుపెట్టేశారు.


ఇక కింది స్థాయి నుండి వచ్చిన బుజ్జికి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే అధికారంలో ఉన్న ఐదేళ్లు అభివృద్ధి బాగానే జరిగింది. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం వంటివి జరిగాయి. అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువయ్యేలా చేశారు. కానీ త్రాగునీటి సమస్య పూర్తిగా సమసిపోలేదు. నగర శివార్లలో ప్రజలకి నీటి కొరత పూర్తిగా తీరలేదనే చెప్పాలి. తమ్మిలేరు ఏటిగట్టు, పక్కా ఇళ్ల నిర్మాణం వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక ఇటీవల నగరంలో మంచి పట్టున్న ఏలూరు మేయర్‌ నూర్జహాన్, ఆమె భర్త, కోఆప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌ పెదబాబులు వైసీపీలో చేరడం బుజ్జికి దెబ్బనే చెప్పాలి. అయితే వైసీపీలో టికెట్ దక్కని బలరాం కుటుంబం టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉండటంతో ఆపార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది.


మరోవైపు గతంలో ఏలూరు నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆళ్ళ నాని మరోసారి వైసీపీ నుండి పోటీకి దిగుతున్నారు. ఈసారి తప్పకుండ గెలవాలని పట్టుదలతో ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై బాగానే స్పందించారు. అలాగే పార్టీ కార్యక్రమాలన్నీ, నవరత్నాలని ప్రజల్లోకి తీసుకెళ్లి బలపడ్డారు. ఇక ఇటీవల మేయర్ కూడా చేరడం వైసీపీకి అదనపు బలం. అటు  గతంలో టీడీపీలో ఉన్న రెడ్డి అప్పలనాయుడు తర్వాత వైసీపీలో చేరి ప్రస్తుతం జనసేన అభ్యర్థిగా ఏలూరు నుండి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువగానే ఉండటంతో జనసేనకి కలిసొచ్చే అవకాశం ఉంది. కానీ జనసేనకి గెలిచెంత బలం లేదుగాని ఓట్లు చీల్చే అవకాశం ఉంది. గతంలో ప్రజారాజ్యంకి ఇక్కడ 35 వేల వరకు పడ్డాయి. అయితే ప్రధాన పోరు టీడీపీ-వైసీపీల మధ్య ఉన్న..జనసేన ప్రభావం వలన గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉంది. మరి చూడాలి ఈ సారి ఇక్కడ ఏ పార్టీ గెలిచి...రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందో


మరింత సమాచారం తెలుసుకోండి: