భార‌తీయ జ‌న‌తాపార్టీకి కీల‌క‌మైన ఎన్నిక‌ల త‌రుణంలో ముఖ్య‌నేత‌లు గుడ్‌బై చెప్తున్నారు. తాజాగా ఒకేరోజు ఇద్ద‌రు నేత‌లు త‌మ ప‌ద‌వుల‌కు టాటా చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌రాష్ట్రమైన గుజరాత్‌తో పాటుగా బీజేపీ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన అసోంలో సిట్టింగ్ ఎంపీ పార్టీని వీడారు. గుజ‌రాత్‌లో పాటిదార్ ఉద్యమ నాయకురాలు రేష్మా పటేల్ తాజాగా బీజేపీని వీడారు. ఇదే స‌మ‌యంలో తాను పార్టీని వీడుతున్నానని అసోంలోని తేజ్‌పూర్ బీజేపీ ఎంపీ రామ్‌ప్రసాద్ సర్మహ్ ప్రకటించారు. 

Image result for bjp reskha patel

రెండున్నరేళ్ల పాటు పాటిదార్ల ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు రేష్మా. పాటిదార్ల డిమాండ్లను నెరవేరుస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో ఆమె బీజేపీలో చేరారు. కానీ బీజేపీ నాయకుల వ్యవహార శైలితో విభేదించిన ఆమె ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సంద‌ర్భంగా రేష్మా మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ ఓ మార్కెటింగ్ కంపెనీ అని  ధ్వజమెత్తారు. బీజేపీ ఇప్పుడు కేవలం మార్కెటింగ్ కంపెనీగా మారిందని ఆమె మండిపడ్డారు. తప్పుడు విధానాలు, తప్పుడు పథకాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రజలను ఎలా మోసం చేయడంపై తమకు శిక్షణ ఇస్తున్నారని రేష్మా పటేల్ పేర్కొన్నారు.
Image result for bjp ram prasad

ఈ క్రమంలో బీజేపీని వీడాల్సి వస్తోందని ఆమె తెలిపారు. తన రాజీనామా లేఖను గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జితూ వాఘానికి అందజేసినట్లు రేష్మా చెప్పారు. బీజేపీలో తనను అవమాన పరిచారని, అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని  తేజ్‌పూర్ బీజేపీ ఎంపీ రామ్‌ప్రసాద్ సర్మహ్ ప్రకటించారు. బీజేపీకి 29 ఏళ్ల పాటు సేవలందించానని రామ్‌ప్రసాద్ చెప్పారు.


తాను బీజేపీని వీడడం ఎంతో బాధగా ఉందన్నారు. పాత తరం నాయకత్వాన్ని.. కొత్తగా వచ్చిన కొంతమంది నాయకులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తేజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని, కావాలనే తన పేరును చేర్చలేదని రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై మండిపడ్డారు. తన పేరు లేకపోవడంతో అవమానానికి గురయ్యానని రామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ బతికున్నంత కాలం అసోం ప్రజలకు సేవ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: