సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ మ‌రో కీల‌క ప్ర‌క‌టన చేసింది. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌న ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన తెలంగాణపై ఫోక‌స్ పెట్టింది. లోక్‌స‌భ స్థానాల నుంచి పోటీకి బయోడేటాలు స్వీకరణ ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టింది. ఈ మేర‌కు జ‌న‌సేన కార్యాల‌యంలో ప్ర‌త్యేకంగా ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ చేప‌ట్టింది. జనసేన తాజాగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం, పార్టీ తరఫున తెలంగాణలోని లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు తమ అభ్యర్థిత్వాలను పరిశీలించమంటూ హైదరాబాద్, విజయవాడల్లోని జనసేన కార్యాలయాల్లో  దరఖాస్తును చాలామంది నేరుగా అందచేశారని పేర్కొంది.

``ఆశావహుల కోసం ఇరువురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశాం. స్వయంగా తమ బయోడేటాలను ఈ కమిటీకి అందచేయవచ్చు. జనసేన పార్టీ మూల సిద్ధాంతాలు, పార్టీ విధానాలపై విశ్వాసం ఉన్న సేవాతత్పరులు, జన సైనికులు తమ బయోడేటాలను ఈ కమిటీకి సమర్పించవచ్చు, పార్టీ నాయకులు నేమూరి శంకర్ గౌడ్, అర్హం ఖాన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్ మాదాపూర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఆశావహులు తమ బయోడేటాలు అందచేయవచ్చు`` అని తెలిపింది.


హైదరాబాద్ మాదాపూర్ కార్యాలయంలో మూడు రోజులపాటు ఈ కమిటీ బయోడేటాలు స్వీకరిస్తుందని జ‌న‌సేన వెల్ల‌డించింది. ``ఆశావహుల ప్రొఫైల్స్, రాజకీయ నేపథ్యాన్ని కమిటీ పరిశీలిస్తుంది. అభ్యర్థి ఎంపికకు సాధికారత జనసేన జనరల్ బాడీ మాత్రమే కలిగి ఉంది. అభ్యర్థిత్వాన్ని ఆశించేవారు ఎవరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకావద్దు. పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో, ప్రజా సేవ చేయాలనే తపన ఉన్నవారు కమిటీ ముందు బయోడేటాలు ఇస్తే పరిశీలన చేస్తుంది.`` అని స్ప‌ష్టం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: