ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ గుంటూరు జిల్లా రేపల్లెలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఇక్కడ ఇద్దరు బీసీ నేతలు విజయం కోసం పోటీ పడుతున్నారు. టీడీపీ నుండి అనగాని సత్యప్రసాద్ గౌడ్, వైసీపీ నుండి మోపిదేవి వెంకటరమణలు హోరాహోరీగా ప్రచారం చేస్తూ ప్రజల దగ్గరకి వెళుతున్నారు. గత ఎన్నికల్లో మోపిదేవిపై విజయం సాధించిన అనగాని ఈ సారి కూడా గెలిచి సత్తా చాటాలని చూస్తుంటే.... ఈ సారి ఎలా అయిన గెలిచి గత ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని మోపిదేవి సిద్ధమయ్యారు.


అయితే అన్ని శాఖ‌ల్లోనూ మంచి ప‌ట్టున్న అనగాని విరివిగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి ప‌నులు చేశారు. ఇటు పార్టీ కేడ‌ర్‌ను పోషించ‌డంలోనూ ఆయ‌న‌కు మంచి మార్కులే ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయ‌డంలో, రోడ్లు వేయించడంలో అన‌గాని ముందున్నారు. ఇక ఈ సారి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకిత ఉండటం కొంత మైనస్ కావొచ్చు. అలాగే అనగానిపై అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోవడంలేదన్న ఆరోపణ ఉంది. అభివృద్థి పనుల్లో నాణ్యత లేకపోవడంతో ఎమ్మెల్యేపై కొంత ఆరోపణలు వచ్చాయి. పార్టీలో కొత్తగా చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు సీనియర్ నేత మల్లిఖార్జున్ రావు పార్టీని వీడటం ఇబ్బందికరమైన విషయం.


ఇక గ‌తంలో గెలిచి మంత్రిగా కూడా ప‌నిచేసిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. అయితే అంతకముందు అవినీతి ఆరోప‌ణ‌ల కేసుల్లో జైలుకు వెళ్లి రావడం ఇంకా వెంక‌ట‌ర‌మ‌ణకి మైనస్ గానే ఉంది. ఆర్థికంగా కూడా ఇక్క‌డ ఆయ‌న వీక్‌గా ఉన్న‌ట్టు స‌మాచారం. కానీ కొంత కాలం నుండి పార్టీ క్యాడర్‌ని కలుపుకుపోవడం....ప్రజల్లో ఉండటం ఆయనకి కలిసొచ్చే అంశం. అటు రాష్ట్రంలో వైసీపీ పుంజుకోవడం మోపిదేవికి కొంతవరకు బెనిఫిట్ అవుద్ది.


మరోవైపు సీనియర్ నేత దేవినేని మల్లిఖార్జునరావు జనసేన నుండి పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 25వేలమంది ఉన్నారు. దేవినేని చేరడం, కాపు ఓటర్లు జనసేనకి ప్లస్ పాయింట్స్. కానీ టీడీపీ, వైసీపీకి ఉన్న క్యాడర్ జనసేనకి లేకపోవడం మైనస్. అయితే జనసేన గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నియోజకవర్గంలో కాపు, గౌడ కులస్తులు ప్రధాన పాత్ర పోషించనున్నారు. మరి ఈ సారి రేపల్లె రాజకీయంలో కింగ్ ఎవరు అవుతారో. 


మరింత సమాచారం తెలుసుకోండి: