రాష్ట్రానికి ఆక్వా రాజధాని అయిన భీమవరంలో ఈ సారి హాట్ హాట్ రాజకీయాలు జరిగేలా కనిపిస్తున్నాయి. క్రిందటిసారి టీడీపీ-వైసీపీల మధ్యే ప్రధాన పోరు జరగగా... ఈ సారి పోరులో జనసేన కూడా వచ్చి చేరింది. క్షత్రియ, కాపు సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్న ఈ భీమవరం... ఈ సారి ఏ పార్టీకి వరం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) మరోసారి ఇక్కడ నుండి బరిలో దిగుతుండగా.... అంజిబాబు చేతిలో ఓడిపోయిన గ్రంథి శ్రీనివాస్ మళ్ళీ వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు.   వ్యక్తిగతంగా సౌమ్యుడు, వివాద రహితుడు అయిన అంజిబాబు నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారు. అలాగే అవినీతి, అక్రమాలు లాటి విమర్శలు ఈయనపైనా పెద్దగా రాలేదు. అటు ప్రభుత్వ పథకాలని కూడా ప్రజలకు అందేలా చేశారు. గ్రామాల్లో సి‌సి రోడ్ల నిర్మాణం కూడా బాగానే జరిగింది.


అయితే అంజిబాబు అనుకున్నంత మేర అభివృద్ధి చేయలేదని టాక్ కూడా ఉంది. వాస్తవంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేసింది లేదు. గత ఎన్నికలకు ముందే అంజిబాబు టీడీపీలోకి జంప్ చేసి విజయం సాధించారు. ఇలా కాంగ్రెస్, టీడీపీలో వరుసగా 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న అంజిబాబుపై వ్యతిరేకిత కూడా బాగానే ఉంది. అటు నియోజకవర్గంలో టీడీపీని నిలబెట్టుకున్న నేతలకి ఈ సారి కూడా టికెట్ రాకపోవడంతో వారు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న చర్చల ప్రకారం చూస్తే అంజిబాబుకు ఈ సారి ఎన్నికల్లో ఎదురు గాలులు తప్పవని అంటున్నారు.


మరోవైపు గత ఎన్నికల్లో ఓడిన గ్రంథి శ్రీనివాస్ ఈ సారి ఎలా అయిన గెలవలనే పట్టుదలతో ఉన్నారు. అంజిబాబుతో పోలిస్తే శ్రీనివాస్‌ దూకుడుగా ఉంటారన్న పేరు ఉంది. ఆయన 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు చేసిన అభివృద్ధి పనులు కూడా ఆయనకు ప్లస్‌ కానున్నాయి. అయితే ఓ ప్రధాన సామాజికవర్గంతో ఆయనకు ఉన్న తీవ్రమైన వైరుధ్యం ఉండటం వలన గెలుపుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక దీనితో పాటు జనసేన పార్టీ గ్రంధి గెలుపు, ఓటమిలను శాశించే పరిస్థితి ఏర్పడింది. ఇక నియోజకవర్గంలో పవన్‌ అభిమానులు, కాపు సామాజికవర్గం బలంగా ఉండడంతో జనసేన సైతం గట్టి పోటీ ఇస్తుంది. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి పోటీ అభ్యర్ధికి 40వేల ఓట్ల వరకు వచ్చాయి.


ఇక ఈ ఎన్నికల్లోనూ భీమవరంలో జనసేన గట్టి పోటీ ఇస్తుందని రాజకీయ వర్గాలు ఇప్పటికే అంచనా వేస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో భీమవరం మున్సిపాలిటీతో పాటు భీమవరం రూరల్‌, వీరవాసరం మండలాలు విస్తరించి ఉన్నాయి. భీమవరంలో క్షత్రియులు ఎక్కువ ఉండగా... వీరవాసరంలో కాపులు ఎక్కువ ఉన్నారు. ఏదేమైనా ఈ సారి ఎన్నికల్లో భీమవరంలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య త్రిముఖ తప్పేలా లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: