విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రధాన పార్టీ అభ్యర్ధులను  ప్రకటించేశారు. టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమారు, వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివస్, జనసేన తరఫున గంప గిరిధర్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ పోటీలో ఉన్న ప్రధాన   పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యేనని అంటున్నారు.


అయితే ఇక్కడ చివరి నిముషంలో వచ్చిన కాంగ్రెస్ నేత ద్రోణం రాజుకు టికెట్ ఇవ్వడం పట్ల వైసీపీలో అసమ్మతి  జ్వాల రేగుతోంది. ఇక్కడ తాజా ఇంచార్జిగా ఉన్న డాక్టర్ రమణమూర్తి వర్గం అపుడే  పార్టీకి దూరమవుతోంది. మరో మాజీ ఇంచార్జి కోలా గురువులు సైతం డీలా పడ్డారు. వీరిని  కలుపుకుని ద్రోణం రాజు ఇక్కడ గెలుపు కోసం పోరాడాల్సివుంది. రెండు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ఇక్కడ మంచి పట్టు ఉంది. పైగా ద్రోణం రాజు కుటుంబం పట్ల ఆదరణ, బ్రాహ్మణ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కలసివస్తాయని అంటున్నారు. 2009 ఎన్నికల్లో ఇదే ద్రోణం రాజు వాసుపల్లి గణేష్ కుమార్ ని ఓడించిన చరిత్ర కూడా ఉంది


ఇక వాసుపల్లి ముచ్చటగా మూడవమారు బరిలోకి దిగుతున్నారు. 2009 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఓడిన ఆయన 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. అందువల్ల మరో మారు ఆయనకే  టికెట్ ఇచ్చారు. ఇక్కడ మైనారిటీలకు టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే రహమాన్, మరో మైనారిటీ నేత జహీర్ అహ్మద్ కోరినా హై కమాండ్ వారిని బుజ్జగించింది. పార్టీ పదవులు కట్టబెట్టింది. ఎమ్మెల్సీలు చేస్తామని హామీ ఇచ్చింది. దాంతో వాసుపల్లికి పార్టీలో ఇబ్బందులు తొలగినట్లే.  వైసీపీలో వర్గ పోరు సరిచేసుకుంటే ద్రోణం రాజు వాసుపల్లి మధ్యన భీకరమైన పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: