తెలంగాణ కాంగ్రెస్‌కు షాకుల ప‌రంపర కొన‌సాగుతోంది. ఒక‌రి వెంట మ‌రొక‌రు అన్న‌ట్లుగా ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్ప‌డం కొన‌సాగుతోంది. కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు ఈ మేర‌కు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఆయ‌న ఫాంహౌజ్‌లో క‌లిసిన అనంత‌రం ఈ ప్ర‌క‌ట‌న చేశారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కలిసి ఆయన నాయకత్వంలో పనిచేస్తామంటూ తమ ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప‌ది మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లుగా ప్రకటించారు.

ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే అత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌ రెడ్డి, ఎల్‌బీ న‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. వీరితో పాటుగా మరికొందరు ఆదే దారిలో ఉన్నట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ జాబితాలో కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్‌రావు చేరారు.  ఇంకో ఎమ్మెల్యే పార్టీకి గుడ్‌బై చెప్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. 


ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వనమా వెంకటేశ్వర్ రావు భేటీ అయ్యారు. అనంత‌రం మీడియాకు వ‌న‌మా ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరతానని వెల్లడించారు. "ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించుకున్నాను. కేసీఆర్‌పై విశ్వాసంతో టీఆర్‌ఎస్ నాయకత్వానికి మద్దతు పలుకుతున్నాను. నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను.

అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. సీఎం కేసీఆర్ అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎంతో కాలంగా ఉన్న కొత్తగూడెం జిల్లా ఏర్పాటు డిమాండ్‌ను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. సీతారామ ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం, కొత్త రహదారుల నిర్మాణం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాటుపడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని ముక్త కంఠంతో బలపరిచారు." అని ఆయన ఈసందర్భంగా వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: