తెలంగాణ సీఎం కేసీఆర్ వేస్తున్న అడుగులు మ‌రోసారి సంచ‌ల‌నం కాబోతున్నాయా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. అవసరమైతే జాతీయ పార్టీని స్థాపిస్తానని కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ నుంచి 16 ఎంపీ సీట్లు గెలిపిస్తే, దాన్ని 160 సీట్లు చేసే బాధ్యత తనదేనని కేసీఆర్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ సాయంతో ఇతర పార్టీలను ఏకం చేసి 160 ఎంపీ సీట్లు కూడగడతామన్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి పంపిస్తే దేశం తలరాత మార్చేందుకు తాను క్రియాశీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ ప్రకటించారు. 


లోక్ సభ ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాల్లోకి వెళతానని స్పష్టం చేసిన గులాబీ ద‌ళ‌ప‌తి... ఈ ఎన్నికల్లో లోక్‌స‌భ‌కు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నల్లగొండ నుంచి కాకపోతే... కేసీఆర్ తన సొంత జిల్లా అయిన మెదక్‌లోని మెదక్ సీటు నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయొచ్చని తెలుస్తోంది. ఇక  కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేసినా ఆశ్చ‌ర్యం లేదు. 


మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నేష‌న‌ల్ పాలిటిక్స్ వైపు వెళ్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో అంద‌రి చూపు కేటీఆర్ వైపే ప‌డుతోంది. ఎందుకంటే కేసీఆర్ త‌న‌యుడు, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాబోయే సీఎం అనే మాట ఆ పార్టీలో గ‌ట్టిగా వినిపిస్తోంది. కేసీఆర్ అనుకున్న‌ట్టుగా పార్ల‌మెంట్ స్థానాలు క‌లిసి వ‌చ్చి, జాతీయ రాజ‌కీయాల్లో కీల‌కంగా మారితే గ‌న‌క‌ మ‌రో రెండు నెలల త‌ర్వాత తెలంగాణకు కొత్త ముఖ్య‌మంత్రిగా కేటీఆర్ అవ్వ‌డం ఖాయం అంటున్నారు గులాబీ నేత‌లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: