సామాన్యుడుగా ఉన్న ఆళ్ళ రామకృష్ణా రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు. అసలు ఏపీలోనే ఈ మెజారిటీతో గెలవడం ఆళ్ళకే సాధ్యమైంది. ఇక ఈ సారి ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి టికెట్ వస్తుందా రాదా అని చాలాసార్లు తర్జనభర్జనలు జరిగాయి. ఇక్కడ బీసీలు ఎక్కువ  ఉండటంతో...ఆ సామాజికవర్గం వారికే టికెట్ ఇవ్వాలని కొందరు వైసీపీ నేతలు పట్టుబట్టారు. కానీ చివరికి జగన్ ఆళ్ళ వైపే మొగ్గు చూపారు. ఆయనకే టికెట్ ఖరారు చేశారు.


మరోవైపు ఏపీ సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్ మంగళగిరి బరిలో దిగడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అటు సామాన్యుడు ఆళ్ళ..ఇటు రాజబిడ్డ లోకేశ్...వీరిలో ఎవరి బలం ఎంత...ఎవరి బలహీనత ఎంత అనే విషయాన్ని బేరీజు వేసుకుంటే. సామాన్యుడుగా ఆళ్ళ ప్రస్తుతం ఆర్ధికంగా బలంగా లేడనే చెప్పాలి. ఇక ఈ విషయంలో లోకేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆళ్ళ ఈ ఐదేళ్లు రాజధాని ప్రాంతంలోని భూములు ఉన్న రైతుల తరుపున పోరాటాలు చేశారు.


అటు లోకేశ్ మంత్రిగా మంగళగిరి ఎంత చేశారో అందరికీ తెలుసు. మంగళగిరి కేంద్రంగా ఐటీ పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు లోకేశ్ ఎంతగానో కృషి చేస్తున్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు... ఐటీ పరిశ్రమలు మంగళగిరికి రావడంలో లోకేశ్ పాత్ర కీలకమనే చెప్పాలి.ఆళ్ళ లోకల్ లీడర్‌గా అందరికీ తెలుసు. నియోజకవర్గంలో వైసీపీ కి క్యాడర్ ఉండటం..రాష్ట్రంలో వైసీపీకి పెరిగిన బలం తనని గెలిపిస్తాయని ఆళ్ళ ధీమాతో ఉన్నారు.


ఇక మంత్రిగా చేసిన అభివృద్ధి...సీఎం తనయుడు కావడం లోకేశ్ కలిసొచ్చే అంశం. అయితే నియోజకవర్గంలో ఆళ్లకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి...ఇక అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలు ఎంతవరకు సహకరిస్తారనేది చూడాలి. అటు 83, 85లో తప్ప మళ్ళీ టీడీపీ గెలవని ఈ ప్రాంతంలో లోకేశ్ పోటీకి దిగడం సాహసమనే చెప్పాలి. దీంతో టీడీపీకి ఇక్కడ ఎక్కువ గెలిచిన రికార్డు లేకపోవడం..ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉండటం మైనస్.


ఇదిలా ఉంటే  ఈ నియోజకవర్గంలో పద్మశాలీయులు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కానీ ఇప్పుడు పోటీ చేసే అభ్యర్ధులు ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు కాదు. ఆళ్ళ రెడ్డి అయితే...లోకేశ్ కమ్మ...వీరికి సంబంధించిన సామాజికవర్గ ఓటర్లు తక్కువ. దీంతో రెండు పార్టీలు...తక్కువగా ఉన్న సామాజికవర్గం వారికి టికెట్ ఇవ్వడంతో పద్మశాలీయులు గుర్రుగా ఉన్నారు. మరి చూడాలి ఎన్నికల్లో వీరు ఎవరు వైపు మొగ్గు చూపుతారో..గెలుపు ఎవరికి కట్టపెడతారో. 


మరింత సమాచారం తెలుసుకోండి: