పదేళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ ఎంపీ బరిలోకి దిగిన దగ్గుబాటి పురంధేశ్వరి మళ్ళీ విశాఖ వైపు చూస్తున్నారని  టాక్. ఈసారి బీజేపీ నుంచి బరిలోకి దిగుతారట. అయిదేళ్ళ క్రితం మోడే గాలి ఓ వైపు, పవన్ చరిస్మా, బాబు అనుభవం అంటూ హోరెత్తిన ప్రచారం ఇవన్నీ కలసి ఇక్కడ బీజేపీ అభ్యర్ధి కంభంపాటి హరిబాబుని  విశాఖ ఎంపీని చేశాయి. మరో వైపు వైసీపీ తరఫున ఎంపీ బరిలో ఉన్న విజయమ్మ పైన నాన్ లోకల్ ముద్రతో పాటు, ఆమె ఎంపీ ఐతే  కడప రాజ్యం  చలాయిస్తారంటూ  చేసిన భయంకరమైన తప్పుడు ప్రచారం కూడా హరిబాబుకు ఎంతో బాగా కలసివచ్చింది. మరి ఇపుడు ఏపీలో బీజేపీ తీరు చూస్తే చాలా దారుణంగా ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉన్నది కూడా పోగోట్టుకుంది. ఆ పార్టీ. అటువంటి పార్టీకి విశాఖలో జనం ఎలా ఓటేస్తారని కమలనాధులు ఆలొచన చేస్తున్నారో కానీ చిన్నమ్మని  దింపుతామని అంటున్నారు.


ఇక బీజేపీ మీద విశాఖ వాసులకు అనేక రకాలుగా అసంత్రుప్తులు ఉన్నాయి. ఇటీవల ప్రకటించిన రైల్వే జోన్ విషయంలోనూ వాల్తేరు లేకుండా చేశారని గుస్సా మీదున్నారు. వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం నుంచి పెద్దగా సాయం లేదన్న బాధ కూడా ఉంది. ఇక ప్రత్యేక హోదాని సమాధి చేశారని పీకల దాకా కోపం ఉంది. ఈ నేపధ్యంలో పురంధేశ్వరి పోటీ చేస్తే ఓటేస్తారా అన్నదానికి సమాధానం చాలా సులువే.  అలాగే,  చిన్నమ్మ సంగతి ఎంత చెప్పుకున్నా తక్కువే. విశాఖ నుంచి ఎంపీగా నెగ్గి యూపీయే సర్కార్ లో మంత్రిగా పనిచేసిన ఆమె విశాఖకు కచ్చితంగా ఈ పని తన హయాంలో చేశారని చెప్పలేని స్థితి ఉంది. 


విశాఖకు రెండవ పోర్టు ఇస్తామంటే దాన్ని తన సొంత జిల్లాకు తీసుకుపోయారన్న ఆరోపణ ఆమెపై ఉంది. ఇక విశాఖకు ఆమె ఆ రోజుల్లో వచ్చిందే తక్కువ. చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయేవారని విమర్శలు ఉన్నాయి. గెలిపించినందుకు సొంత సామాజిక వర్గానికి మాత్రమే ఉపయోగపడ్దారు  తప్ప విశాఖకు కాదని కూడా అంటారు. దాంతో పురంధేశ్వరి వస్తే విశాఖలో గెలిచేస్తామని బీజేపీ  నేతలు చెబుతుంటే విశాఖ జనాలు వినోదం చిత్తగిస్తున్నారు.  ఇక సిట్టింగ్ ఎంపీ హరిబాబు ఈసారి పోటీకి ససేమిరా అంటున్నారంటేనే గెలుపు సంగతి తెలిసిపోతోందని కూడా సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా విశాఖలో కమల విలాసం కధ ముగిసిన అధ్యాయమన్న మాట వినిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: