దేశ రాజకీయాల‌ను మారుస్తాన‌ని, అవ‌స‌ర‌మైతే జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తాన‌ని టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో త‌న ఫోక‌స్ మార్చిన కేసీఆర్ అందులో భాగంగానే తాజా ప్ర‌క‌ట‌న చేశారు. దేశ రాజ‌కీయాల్లోకి వెళుతున్న త‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అయితే, ఈ ప్ర‌క‌ట‌నకు ఆయ‌న త‌న‌యుడు, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఊహించ‌ని క్లారిటీ ఇచ్చారు.


తెలంగాణ‌భ‌వ‌న్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీ ఏర్పడితే ఢిల్లీ నుంచే కాదు.. తెలంగాణ‌ నుంచి కూడా రాజకీయాలు నడిపించవచ్చున‌ని అన్నారు. ``కేసీఆర్ సీఎంగా ఉంటూ ఆదర్శనీయ పాలనతో కేంద్రాన్ని ప్రభావితంచేశారు. అందుకే కేంద్రంస్థాయిలో కిసాన్‌సమ్మాన్ నిధి పేరిట తెలంగాణ రైతుబంధు పథకం వచ్చింది. అంతకంటే మంచి విధానాలతో దేశాన్ని ప్రభావితం చేయొచ్చుకదా! అందుకు ఢిల్లీలోనే కూర్చోవాల్సిన అవసరంలేదు.`` అంటూ పేర్కొన్నారు.


దేశాన్ని 55 ఏళ్ల పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నిస్తే ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరని కేటీఆర్ విమర్శించారు. మోడీని ఏదో ఉహించుకొని 2014లో పూర్తి మెజార్టీ ఇస్తే ఆయన దేశానికి శుష్కప్రియాలు, శూన్యహస్తాలే మిగిల్చారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో మహిళల పోపు డబ్బాలను దోచుకున్నప్పుడే మోడీ ప్రతిష్ఠ మసకబారిందన్నారు. మోడీ గ్రాఫ్ పడిపోయిందని, రాహుల్‌కు ప్రజల్లో ఆదరణ లేదని చెప్పారు. వీరిద్దరూ కలిసినా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ రాదన్నారు. అందుకే తాము ప్రాంతీయ పార్టీల శ‌క్తిని కూడ‌గ‌డుతున్నామ‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: