రెండు నియోజకవర్గాల నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీకి రెడీ అవుతున్నారు. విశాఖపట్నం జిల్లాలోని గాజువాకతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుండి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఎక్కడి నుండి పోటీచేయాలనే విషయంలో జనసేన స్క్రీనింగ్ కమిటి నానా అవస్తలు పడింది. చాలా నియోజకవర్గాల్లో సర్వేలు చేయించింది. మొత్తానికి పవన్ గెలుపుకు పై రెండు నియోజకవర్గాలు సురక్షితమైనవని అనుకుని ఎంపిక చేసింది. పవన్ కూడా పోటీకి సై అంటున్నారు.  ఒక పార్టీ అధినేత రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయటం చాలా కాలం తర్వాత ఇదే.

 

భీమవరం నియోజకవర్గం విషయాన్ని తీసుకుంటే ఇక్కడ సుమారు 2.5 లక్షల ఓట్లుంటాయి. మొత్తం ఓటర్లలో బిసిల జనాభా సుమారు 1 లక్షదాకా ఉంటుంది. తర్వాత కాపులుంటారు. కాపు ఓటర్లు సుమారు 60 వేలదాకా ఉంటుంది. తర్వాత వరుసగా రాజులు 22 వేలు, ఎస్సీలు 20 వేలుంటారు.  మిగిలిన సామాజికవర్గాల ఓట్లు కూడా తక్కువేమీ కాదు. ఇక్కడి నుండి వైసిపి అభ్యర్ధిగా గ్రంధి శ్రీనివాస్ పోటీలో ఉంటే టిడిపి తరపున అంజిబాబు పోటీ చేస్తున్నారు.

 

ఇక రెండో నియోజకవర్గమైన గాజువాక విశాఖపట్నం జిల్లాలోనిది.  ఇక్కడ సుమారు 2.7 లక్షల ఓట్లుంటాయి. ఇక్కడ కూడా బిసిలు 1.5 లక్షలుంటారు. తర్వాత కాపులు 60 వేల వరకూ ఉంటారు. మిగిలిన సామాజికవర్గాలకు చెందిన ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ టిడిపి తరపున పల్లా శ్రీనివాస్ సిట్టింగ్ ఎంఎల్ఏగా పోటీ చేస్తుంటే వైసిపి తరపున తిప్పల నాగిరెడ్డి రంగంలో ఉన్నారు. వైసిపి, టిడిపి అభ్యర్ధులిద్దరూ బిసిలు కాగా పవన్ కాపు సామాజికవర్గం వ్యక్తి కావటం గమనార్హం. మొత్తం మీద తన సోదరుడు చిరంజీవి లాగ రెండుచోట్ల పోటీ చేయటమంటే పవన్ సాహసం చేస్తున్నట్లే లెక్క.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: