పాలకొల్లు... 2009లో ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్‌ చిరంజీవి లాంటి బలమైన అభ్యర్ధిని సైతం ఓడించిన నియోజకవర్గం. చిరంజీవి సొంత నియోజకవర్గమైనా...అప్పుడు జరిగిన త్రిముఖ పోరులో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ఉషారాణి గెలుపొందారు. అయితే 2009, 1989 మినహా...1983 నుండి...2014 వరకు జరిగిన అన్నీ ఎన్నికల్లో టీడీపీనే ఇక్కడ గెలుపొందింది. ఇక అంతటి రాజకీయ చైతన్యం కలిగిన పాలకొల్లు నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోరు జరిగేలా కనిపిస్తోంది. టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మరోసారి బరిలో ఉండగా...మొన్నటివరకు టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న డాక్టర్ బాబ్జీ వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు. అటు వైసీపీ బాబ్జీకి టికెట్ ఇవ్వడంతో గుణ్ణం నాగబాబు జనసేనలో చేరి...అక్కడ నుండి పోటీకి దిగుతున్నారు. మరి ఈ త్రిముఖ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు..ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..


సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల ఈ ఐదేళ్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు. ఇక సంక్షేమానికి కూడా పెద్ద పీట వేస్తూ ముందుకు సాగారు. టౌన్ ర‌హ‌దారులు, అప్రోచ్ రోడ్లు, సిమెంట్ డ్రైన్లు, తాగునీటి స‌మ‌స్య లేకుండా చేశారు.. గ్రామాల్లో అభివృద్ది కూడా చెప్పుకోదగిన విధంగా చేశారు. ఇవన్నీ ఈ ఎన్నికల్లో ఆయన ప్లస్ పాయింట్స్ కానున్నాయి. ఆర్ధికంగా, సామాజికంగా నిమ్మల బలంగానే ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో జనసేన టీడీపీకి మద్ధతు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తుంది. దీంతో ఓట్లు చీలే అవకాశం ఉంది. అలాగే మొన్నటివరకు బీజేపీలో  ఉన్న బాబ్జీ వైసీపీలోకి వెళ్ళడం కొంచెం ఇబ్బందే. పైగా ఇప్పుడు ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది.


అటు సీనియర్ నేత బాబ్జీ వైసీపీ నుండి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉండటంతో నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అలాగే ప్రజల్లో బాబ్జీకి మంచి పేరుంది. కానీ టీడీపీ, జనసేనలు కూడా ఇక్కడ బలంగా ఉన్నాయి. అటు వైసీపీ టికెట్ ఆశించి అసంతృపితో నాగబాబు జనసేనలో చేరడం పార్టీకి ఇబ్బందికరం. అలాగే కాపుల విష‌యంలో జ‌గ‌న్ క్లారిటీ ఇవ్వ‌లేక‌పోవ‌డం. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు దూకుడుగా అమ‌లు చేస్తుండ‌డం వైసీపీకి మైనస్ అవుతాయి. ఇక జనసేన నుండి పోటీ చేస్తున్న నాగబాబు కూడా నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఇక్కడ చిరంజీవి, పవన్ అభిమానులు ఎక్కువ ఉండటం వారికి కలిసొస్తుంది. కానీ వైసీపీ, టీడీపీ అంత స్ట్రాంగ్‌గా జనసేన లేదు.


కాగా, ఇక్క‌డ కాపు సామాజిక వ‌ర్గం రాజ‌కీయంగా బ‌లమైన‌ది, వైశ్య‌సామాజిక‌ వ‌ర్గం రాజ‌కీయంగా ఆర్ధికంగా బలంగా ఉంది. అటు బీసీ, ద‌ళిత‌ ఓటు బ్యాంకు కూడా బాగా ఉంది. అయితే కాపుల మద్ధతు ఎక్కువ ఎవరు వైపు ఉంటే వారు గెలుపు కొంచెం సులువు అవుతుంది. మరి చూడాలి ఈసారి పాలకొల్లులో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో. 



మరింత సమాచారం తెలుసుకోండి: