ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో...ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి. అంతా ప్రజల దగ్గరకి వెళుతూ..ఓట్లు వేయాలని అభ్యర్ధిస్తూ...గెలుపు వాకిట నిలవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా నూజివీడులో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ అభ్యర్ధులు హోరాహోరీగా ప్రచారం చేస్తూ..గెలుపు కోసం కష్టపడుతున్నారు.


అయితే గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుండి పోటీ చేసిన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గెలిచారు. టీడీపీ నుండి పోటీ చేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఓడిపోయారు. ఇక ఈ సారి ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరే మళ్ళీ బరిలో ఉన్నారు. మరి నూజివీడులో రెండు పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం...


రెండు సార్లు నూజివీడు ఎమ్మెల్యేగా గెలిచిన మేకా ప్రతాప్‌కి..ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. వివాదరహితుగా ఉన్న ప్రతాప్...అధికారంలో లేకపోయిన ప్రజలకి అందుబాటులోనే ఉంటూ వచ్చారు. ఇక అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండటం వలన ఈయన ఎక్కువ పనులు చేయలేదు. ప్రతాప్‌ పార్టీ మారకుండా ఉంచటానికి జగన్‌ తెలంగాణ రాష్ట్రంలో తన సన్నిహితుల ద్వారా రూ.50కోట్లు విలువచేసే కాలువల సబ్‌ కాంట్రాక్ట్‌ను ఇప్పించారనే ప్రచారం కూడా ఉంది. దీంతో కొంత ఆర్ధికంగా కూడా బలపడినట్లు కనపడుతుంది.


అటు టీడీపీ నుండి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అనేకమంది నేతలనీ కాదని చంద్రబాబు మళ్ళీ ముద్రబోయినకే టికెట్ ఇచ్చారు. అధికార పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ముద్రబోయిన  నియోజకవర్గంలో ఏ సమస్య  ఉన్నా చంద్రబాబు దగ్గరకు వెళ్లి పని చేయించుకున్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువయ్యేలా చేశారని టాక్ ఉంది. కానీ నియోజకవర్గంలో వర్గపోరు కూడా చాలా ఎక్కువగానే ఉంది. ముద్రబోయిన తీరు వల్ల టీడీపీకి కమ్మ సామాజికవర్గం దూరమవ్వడం మైనస్ అవ్వనుంది. ఇక టికెట్ దక్కని నేతలు ముద్రబోయినకి ఎంతవరకు సహకరిస్తారో చెప్పలేం. అయితే ఎన్ని ఉన్న ఇక్కడ టీడీపీకి గట్టి క్యాడర్ ఉండటం ప్లస్.


ఇక పొత్తులో భాగంగా జనసేన ఈ సీటుని సీపీఐకి ఇచ్చింది. దీంతో ప్రధాన పోరు టీడీపీ-వైసీపీల మధ్యే జరగనుంది.  ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు, యాదవ, గౌడ ఓటర్లు అధికం. తరువాత స్థానంలో ఎస్సీలు ఉన్నారు. ఓసీలలో కమ్మసామాజిక వర్గం 22వేలు, కాపు సామాజికవర్గం 24 వేలు ఉండగా, మిగిలిన వారు ఇతర అగ్రవర్ణాలకు చెందిన వారు. కమ్మ, యాదవ, గౌడ సామాజికవర్గం ఓటర్ల బట్టే గెలుపోటములు డిసైడ్ కానున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: