సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి అప్పటి నుంచి కాంగ్రెస్‌ నేతగానే కొనసాగుతున్నారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో సినిమాలతో బిజీగా మారారు. ప్ర‌స్తుతం ‘సైరా’ మూవీలో నటిస్తున్నాడు. 

కొన్ని నెల‌ల క్రిత‌మే చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నా, ఆ పార్టీకి రాజీనామా చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఏపీ ఎన్నిక‌లు హాట్ హాట్ గా సాగుతున్న వేళ‌ చిరంజీవి కాంగ్రెస్ పార్టీనుంచి అధికారకంగా బయటికి వస్తారనీ, తమ్ముడు పెట్టిన జనసేన పార్టీకి మద్దతు ఇస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. తాను చిరు ఆశీస్సులతోనే జనసేనలో చేరినట్టు జనసేనలో చేరిన స‌మ‌యంలో నాదెళ్ల మనోహర్ చెప్పడం చిరంజీవి కాంగ్రెస్ ను వీడనున్నారనే ఊహలకు బలమిస్తోంది.

 
చిరు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించే ఉద్దేశంతో లేరని, భవిషత్తులో తమ్ముడు పవన్ కు మద్దతుగా నిలబడ్డానికే పరిమితమవుతారని రాజకీయ నేతలు పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈ ఎన్నిక‌ల ప్ర‌చారానికి క్లైమాక్స్ స‌మ‌యంలో జ‌న‌సేన స‌భ‌ల్లో చిరు పాల్గొంటార‌నే టాక్ కూడా వినిపిస్తోంది. నాగాబాబు కూడా అన్న‌య్య ఆశీస్సుల‌తో త‌మ్ముడి పార్టీ త‌రుపున లోక్‌స‌భ టికెట్ అందుకుని బ‌రిలోకి దిగారు. తాను అన్న‌య్య పంపితే వచ్చానని, తామంతా తమ్ముడికి అండగా ఉంటామని కూడా నాగబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. త‌న బాబాయ్‌కే మ‌ద్ద‌తు ఉంటుంద‌ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా చాలాసార్లు ప్ర‌క‌టించాడు. మ‌రోవైపు మెగా అభిమానులంద‌రిని జ‌న‌సేన‌కు ప‌ని చేయాల్సిందిగా చిరు నుంచి అదేశాలు కూడా వెళ్లాయి. ఇదంతా చూస్తుంటే చిరు కాంగ్రెస్ కు దూర‌మై, జ‌న‌సేన‌కు త‌న‌వంతు మ‌ద్ద‌తు తెలుపుతార‌ని టాక్ వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: