చంద్రబాబునాయుడు మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారా ? వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అవుననే అంటున్నారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా జగన్ మాట్లాడుతూ, తన అధికారానికి అడ్డు వస్తాడని అనుకుంటే ప్రధానమంత్రిని సైతం చంపిస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను అడ్డుపెట్టుకుని ఐదేళ్ళు రాష్ట్రాన్ని దోచేసినట్లు మండిపోయారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది చంద్రబాబే అంటూ తీవ్రంగా ఆరోపించారు.

 

వాళ్ళే చంపించి, వాళ్ళే దర్యాప్తు చేస్తు, వాళ్ళ మీడియాలోనే తమపై దుష్ప్రచారం చేయిస్తున్నట్లు చెప్పారు. తమ కుటుంబసభ్యుడిని కోల్పోయి తాము బాధపడుతుంటే తిరిగి తమకుటుంబ సభ్యులపైనే హత్యారోపణలు చేయటం దారుణమన్నారు. చంద్రబాబుకు మద్దతుగా నిలబడుతున్న అమ్ముడుపోయిన మీడియా ద్వారా తమపై దుష్ప్రచారాలు చేయించటం న్యాయమా ? అంటూ జగన్ ప్రశ్నించారు.  

 

తమ చిన్నాన్న హత్యలో చంద్రబాబు హస్తం లేకపోతే సిబిఐ దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారంటూ నిలదీశారు. చంద్రబాబు గురించి పిల్లనిచ్చిన మామగారు ఎన్టీయార్ మాటలు వింటే అర్ధమవుతుందన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన హత్యోదంతాలను వివరించారు. గడచిన ఐదేళ్ళల్లో చంద్రబాబు పాలనలో జరిగిన అరాచకాలను వివరించారు.

 

మొత్తానికి చంద్రబాబు సొంతజిల్లా చిత్తూరులో కీలకమైన నియోజకవర్గాల్లో పలమనేరు కూడా ఒకటి. ఇక్కడి నుండి ఫిరాయింపు ఎంఎల్ఏ ఎన్. అమరనాధరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేయటం మంత్రికి ఏమాత్రం ఇష్టం లేదు. నియోజకవర్గం మారటానికి చంద్రబాబు అంగీకరించకపోవటంతో మంత్రికి వేరేదారి లేక పోటీ చేస్తున్నారు.

 

వైసిపి తరపున వెంకటేష్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఆర్ధిక, అంగ బలాల్లో ఎంత శక్తమంతుడైన అమరనాధరెడ్డికి మొదటిసారి పోటీ చేస్తున్న వెంకటేష్ ఏ విధంగా పోటీ ఇస్తారనే విషయంలో ఆసక్తిగా మారింది. దాదాపు 40 నిముషాల పాటు సాగిన జగన్ స్పీచ్ లో జనస్పందన మాత్రం బ్రహ్మాండంగా కనిపించింది. జన స్పందన చూసిన తర్వాత తమ అభ్యర్ధి విజయంలో వైసిపి నేతల్లో గట్టి నమ్మకం ఏర్పడింది. మరి ఓటర్లు ఎవరిని ఆధరిస్తారో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: