తెలుగుదేశం పార్టీ సార‌థ్యంలోని ఏపీ స‌ర్కారుకు ఇంకో షాక్ త‌గిలింది. ఏపీ ప్ర‌భుత్వం షాక్ తినే తీర్పును ట్రిబ్యున‌ల్ వెలువ‌రించింది. అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ విషయంలో ఈ తీర్పు వెలువ‌డింది. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన్ను వెంటనే రిలీవ్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది. త‌ద్వారా, మాధ‌వ్ పార్ల‌మెంట‌రీ అభ్య‌ర్థిత్వంపై నెల‌కొన్న అడ్డంకి తొల‌గిపోయింది.


హిందూపురం సీఐ మాధ‌వ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వెలువ‌రించిన జాబితాలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాధవ్‌కు హిందూపురం పార్లమెంట్ టికెట్ కేటాయించారు. అయితే నామినేష‌న్ దాఖ‌లు చేసే స‌మ‌యంలో, సాంకేతిక స‌మ‌స్య తెర‌మీద‌కు వ‌చ్చింది. మాధ‌వ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి రెండు నెలలు కావస్తోంది. అయనప్పటికీ మాధవ్ రాజీనామాకు పోలీస్ శాఖ ఆమోదం తెల‌ప‌లేదు. ఈ కార‌ణం వ‌ల్ల ఆయ‌న అభ్య‌ర్థిత్వం ఇబ్బందుల్లో ప‌డింది.


ప‌ద‌వికి రాజీనామా చేసి రెండు నెల‌లు దాటినా...ఇంకా ఆమోదించ‌క‌పోవ‌డం, త‌న పార్ల‌మెంటు పోరుకు స‌మ‌స్య ఎదురైన నేప‌థ్యంలో మాధ‌వ్  ప్రభుత్వ తీరుపై న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయం పై నేడు కోర్టులో విచారణ జరిగింది. ఈ సంద‌ర్భంగా స‌ర్కారుకు న్యాయ‌స్థానం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. మాధవ్ నామినేషన్ ను అంగీకరించాలని ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. రెండు నెలల క్రితం మాధవ్ వీఆర్ఎస్ ఇచ్చినా ప్రభుత్వం ఆమోదించకుండా పక్కన పెట్టడం స‌రికాద‌ని, వెంట‌నే రిలీవ్ చ ఏయాల‌ని పేర్కొంది. తాజా క్లియ‌రెన్స్‌తో  హిందూపురం లోక్‌సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోరంట్ల మాధ‌వ్ బ‌రిలో ఉండ‌నున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: