ఎన్నిక‌ల‌కు స‌మ‌యం వ‌చ్చేసింది. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న‌దైన వ్యూహంతోముందుకు వెళ్తున్నారు. అయితే, ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలే చాలా ఆస‌క్తిగా ఉంటున్నాయి. ముఖ్యంగా రాజ‌ధాని న‌గ‌రం గుంటూరులోని న‌ర‌స‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న నిల‌బెట్టిన అభ్య‌ర్థుల‌పై విస్తృత‌మైన చ‌ర్చ సాగుతోంది. ఇక్క‌డ పేట నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో అభ్యర్థులు తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. వీరిలో గురజాల నుంచి పోటీచేస్తున్న కాసు మహేష్‌రెడ్డికి మాత్రమే రాజకీయ వారసత్వం ఉంది. మిగతా అభ్యర్థులు రాజకీయ వారసత్వం లేకుండానే తొలిసారిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. 


టీడీపీ నుంచి మాచర్ల అసెంబ్లీ స్థానానికి ఎ.అంజిరెడ్డి, నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు తొలిసారిగా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. పెదకూరపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా నంబూరు శంకరరావు, చిలకలూ రిపేట నుంచి విడదల రజని, గురజాల నుంచి కాసు మహేష్‌రెడ్డి తొలిసారి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. వినుకొండ, సత్తెనపల్లి అసెంబ్లీ స్థానాల నుంచి వైసీపీ అభ్యర్థులుగా బొల్లా బ్రహ్మనాయుడు, అంబటి రాంబాబు రెండోసారి బరిలో నిలుస్తున్నారు. మొత్తం మీద ఐదుగురు మినహా మిగిలిన తొమ్మిది మంది ఇరు పార్టీల అభ్యర్థులు గత ఎన్నికల్లో అనుభవం ఉన్నవారే. నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల్లో కులం ప్రధానపాత్ర పోషిస్తూ అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించనుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


ఈ నేపథ్యంలో కుల సమీకరణలపై టీడీపీ, వైసీపీలు దృష్టి సారించాయి. వివిధ సామాజికవర్గాల ఓట్లను ఆకట్టుకొనే పనిలో ఆయా పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు. తెలుగుదేశంపార్టీ బీసీ కార్డును నరసరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి ప్రయోగించింది. వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు లోక్‌సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారు కావటంతో విస్తృత ప్రచారానికి సమాయత్తమవుతున్నారు. కాగా జనసేన, కాంగ్రెస్‌, బీజేపీలు లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాల్లో పూర్తి జాబితాలను విడుదల చేయలేదు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించాయి. ప్రచారపర్వంలో వ్యూహాత్మకంగా ఆయా పార్టీల అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. దీంతో పేట‌పై వైసీపీ అధినేత జ‌గ‌న్ వేసిన ముద్ర ఏమేర‌కు ఫ‌లిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. ఏం జ‌రుగుతుందో చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: