తెలుగుదేశం పార్టీకి, పొలిట్‌బ్యూరో పదవికి ఇటీవ‌లే రాజీనామా చేసిన మాజీ ఎంపీ, సీనియ‌ర్ నేత‌ నామా నాగేశ్వర్‌రావు ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో నామా నాగేశ్వర్‌రావు టీఆర్‌ఎస్ కండువా క‌ప్పుకొన్నారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో నామా నాగేశ్వర్‌రావుతో పాటుగా, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణ కుమారి, అమర్‌నాథ్, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. 


పార్టీలో చేరిన అనంత‌రం నామా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్‌లో చేరినట్టు వెల్లడించారు. తాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఆదేశానుసారం నడుచుకుంటానని స్పష్టం చేసిన నామా నాగేశ్వరరావు... ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని తెలిపారు. 


కాగా, ఖ‌మ్మం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థిగా నామాను ప్ర‌క‌టిస్తార‌నే చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు చ‌ర్చ‌లు పూర్త‌యిన త‌ర్వాతే నామా పార్టీకి గుడ్‌బై చెప్పార‌ని తెలుస్తోంది. కాగా, టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కావాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: